Begin typing your search above and press return to search.

చోటా రాజన్ కు బెయిల్... అయినా కూడా లోపలే!!

ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ గా పేరొందిన చోటా రాజన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది.

By:  Tupaki Desk   |   23 Oct 2024 9:32 AM GMT
చోటా రాజన్ కు బెయిల్... అయినా కూడా లోపలే!!
X

ఒకప్పటి అండర్ వరల్డ్ డాన్ గా పేరొందిన చోటా రాజన్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా అతడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుమారు 22 రెండేళ్ల క్రితం 2001లో జరిగిన హోటల్ యజమాని హత్య కేసులో దోషిగా తేలడంతో చోటా రాజన్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో చోటా రాజన్ కు బాంబే కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

అవును... 2001లో హోటల్ యజమాని హత్య కేసులో మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైం యాక్ట్ (ఏంసీవోసీఏ) కోర్టు చోటా రాజన్ కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో.. నాటి నుంచి అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ శిక్షను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు అతడికి బుధవారం బెయిల్ మంజూరు చేసింది.

జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా లక్ష రూపాయల బాండ్ ఇవ్వాలని ఆదేశించింది. అయితే... ఇతర క్రిమినల్ కేసులు కూడా ఉండటంతో.. ప్రస్తుతం జైల్లోనే ఉంటారని కోర్టు పేర్కొంది.

కేసు ఏమిటి..?:

2001 మే 4వ తేదీన సెంట్రల్ ముంబైలోని గాందేవి ప్రాంతంలొ ఉన్న "గోల్డెన్ క్రౌన్" హోటల్ యజమాని జయశెట్టిని కొంతమంది దుండగులు కాల్చి చంపారు. వీరు చోటా రాజన్ ముఠాలోని సభ్యులు అని చెబుతారు. ఇందులో భాగంగా... చోటా రాజన్ గ్యాంగ్ సభ్యుడు హేమంత్ పూజారీ డబ్బులు ఇవ్వాలని జయశెట్టిని బెదిరించాడు.

అయితే.. అందుకు జయంశెట్టి నిరాకరించడంతో ఆయనను హత్య చేసినట్లు విచారణలో తేలినట్లు పోలీసులు పేర్కొన్నారు. దీంతో.. ఈ హత్య కేసులో చోటా రాజన్ తో పాటు మరికొందరిని దోషులుగా తేల్చిన కోర్టు వారికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో... తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చోటా రాజన్ బాంబే హైకోర్టులో అప్పీలు చేశారు.