Begin typing your search above and press return to search.

సుప్రీంలో అనూహ్యం: గొంతు తగ్గించాలని సీజేఐ ఆగ్రహాం

ఒక కేసు విచారణలో భాగంగా న్యాయవాది అదేపనిగా గట్టిగా మాట్లాడటం.. తన వాదనలు వినిపించే క్రమంలో అదే పనిగా స్వరాన్ని పెంచేస్తున్న తీరుపై సీజేఐ అసహనాన్ని వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   4 Jan 2024 4:47 AM GMT
సుప్రీంలో అనూహ్యం: గొంతు తగ్గించాలని సీజేఐ ఆగ్రహాం
X

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో తాజాగా అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అదే పనిగా గొంతు పెంచేసి వాదనలు వినిపిస్తున్న న్యాయవాదికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టును బెదిరించాలని అనుకుంటున్నారా? అంటూ అసహనం వ్యక్తం చేసిన ఆయన.. దేశ అత్యున్నత న్యాయస్థానంలో మాట్లాడే తీరు ఇదేనా? అన్న ప్రశ్నను సంధించారు.

ఒక కేసు విచారణలో భాగంగా న్యాయవాది అదేపనిగా గట్టిగా మాట్లాడటం.. తన వాదనలు వినిపించే క్రమంలో అదే పనిగా స్వరాన్ని పెంచేస్తున్న తీరుపై సీజేఐ అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘సాధారణంగా మీరు ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? గొంతును పెంచటం ద్వారా కోర్టును బెదిరించలేరు. నా 29 ఏల్ల కెరీర్ లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడు రాలేదు’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

దీంతో జోరు తగ్గించిన సదరు న్యాయవాది.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు క్షమాపణలు చెప్పారు. దీంతో.. ఆయన తిరిగి వాదనలు విన్నారు. అయితే..వాదనలు వినిపించే క్రమంలో న్యాయవాదుల తీరు తేడా వస్తే వారిని వారించటం.. వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ వెనుకాడరు. గతంలోనూ ఇలాంటివి చోటు చేసుకున్నాయి.

సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వికాస్ సింగ్ సైతం ఇదే తరహాలో మాట్లాడటంతో ఆయన స్పందించారు. గొంతు తగ్గించాలని హెచ్చరించటం తెలిసిందే. అంతేకాదు.. గత ఏడాది అక్టోబరులో కోర్టు హాల్ లో ఒక న్యాయవాది ఫోన్ లో మాట్లాడటాన్ని తప్పుపట్టారు. ఇదేమైనా మార్కెట్టా? అని ప్రశ్నించిన సీజేఐ .. తక్షణం ఆ లాయర్ నుంచి ఫోన్ ను సిబ్బంది తీసుకోవాలని ఆదేశించి.. కోర్టు సమయం ముగిసిన తర్వాత ఇప్పించారు. వాదనల విషయంలోనే కాదు.. బిహేవియర్ విషయంలోనూ తేడాగా వ్యవహరించే వారి విషయంలో సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అస్సలు ఉపేక్షించరని చెబుతారు.