ఈసీపై సుప్రీంను ఆశ్రయించిన కాంగ్రెస్.. ఏం జరగనుంది?
ఇటీవల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే.
By: Tupaki Desk | 25 Dec 2024 5:27 AM GMTఇటీవల ఎన్నికల ప్రక్రియకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తీసుకోవటం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే. అయితే.. అక్కడితో ఆగని ఆ పార్టీ ఈ అంశంపై సుప్రీంకోర్టు తలుపు తట్టింది తాజా చర్యలతో ఎన్నికల ప్రక్రియ సమగ్రతకు భంగం కలగొచ్చని పేర్కొంది. ఈ అంశంపై తన అభ్యంతరాల్ని పేర్కొంటూ రిట్ పిటిషన్ ను దాఖలు చేసింది.
ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ వేళ ఎలక్ట్రానిక్ రికార్డుల్ని ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే అంశంపై ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం మార్పులు చేసింది. పోలింగ్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్.. వెబ్ కాస్టింగ్ రికార్డులను.. అభ్యర్థఉలకు సంబంధించిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
ఈ మార్పుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 లోని రూల్ 93(2)(ఏ) ను కేంద్ర న్యాయశాఖ సవరిస్తూ చేసిన నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఇందులో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ సుప్రీంకోర్టుతో తాజాగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేవారు. స్వేచ్ఛగా.. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా.. ప్రజలతో సంప్రదింపులు జరపకుండా ఎన్నికల ప్రక్రియ నిబంధనల్లో మార్పులు చేయటం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో మిగిలిన రాజకీయ పార్టీల స్పందన ఏ రీతిలో ఉంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.