కర్నూలుకు హైకోర్టు బెంచ్...ఆదిలోనే అవాంతరాలు
అయితే మద్రాస్ తో కలసి ఉండడమే తమకు ఇష్టమని ఆ విధంగానే తాము అభివృద్ధి చెందుతామని రాయలసీమ నేతలు చెప్పారని అంటారు.
By: Tupaki Desk | 5 Feb 2025 3:38 AM GMTఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రా ప్రాంతం విడిపోవాలనుకున్నపుడు రాయలసీమ ప్రాంతం వారిని కూడా తమ ఉద్యమానికి మద్దతుగా నిలవాలని కోరారు. అంతా ఆంధ్రులే కాబట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకోవచ్చు అని నాటి నాయకులు ప్రతిపాదించారు. అయితే మద్రాస్ తో కలసి ఉండడమే తమకు ఇష్టమని ఆ విధంగానే తాము అభివృద్ధి చెందుతామని రాయలసీమ నేతలు చెప్పారని అంటారు.
కానీ కోస్తా ఆంధ్రా నాయకులు మాత్రం అంతా కలసి ఉంటేనే ఆంధ్రుల బలం పెరుగుతుందని దేశంలో ఒక గుర్తింపు దక్కుతుందని చెబుతూ వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలోనే రాయలసీమ నేతల నుంచి ఒక ఒప్పందం ఉండాలని ప్రతిపాదన వచ్చింది. అదేంటి అంటే రేపటి రోజున ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయితే రాయలసీమకు రాజధాని అయినా లేదా హైకోర్టు అయినా ఉండాలన్నదే ఆ ప్రతిపాదన. దాని మీద ఆనాటి ఉభయ ప్రాంతాల పెద్దలు మద్రాస్ లోని శ్రీభాగ్ పేరుతో ఉన్న ఒక భవనంలో కూర్చుని ఒప్పందం కుదుర్చుకున్నారు.
దానికే తరువాత కాలంలో శ్రీభాగ్ ఒప్పందం అని పేరు వచ్చింది. ఇదంతా 1937 ప్రాంతంలో జరిగింది. ఆ మీదట మరో దశాబ్దన్నర కాలానికి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం పదకొండు జిల్లాలతో ఏర్పాటు అయింది. ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేశారు, గుంటూరులో హైకోర్టు పెట్టారు. అయితే 1956 నాటికి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్ర రాష్ట్రం విలీనం కావడంతో హైదరాబాద్ అందరి రాజధాని అయింది.
అలా అరవై ఏళ్ళ పాటు సాగిన పాలన తరువాత 2014లో మళ్ళీ విభజన జరిగింది. ఏపీ పదమూడు జిల్లాలతో వేరు పడింది. దాంతో మరోసారి శ్రీభాగ్ ఒప్పందం తెర మీదకు వచ్చింది. అమరావతిని రాజధానిగా చేస్తే మాకు అభ్యంతరం లేదు కానీ కర్నూలుకు హైకోర్టు ఇవ్వాలని రాయలసీమ నుంచి డిమాండ్ వచ్చింది. కానీ రాజధాని హైకోర్టు అన్నీ అమరావతిలోనే ఏర్పాటుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదించడంతో రాయలసీమ వాసులలో అసంతృప్తి ఏర్పడింది.
అది కాస్తా వైసీపీకి అనుకూలంగా మారింది. దాంతో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రాయలసీమలోని కర్నూలుని న్యాయ రాజధానిగా చేస్తామని హైకోర్టుని తరలిస్తామని చెప్పింది కానీ ఆచరణలో అదంత సులువు కాదని తేలిపోయింది. హైకోర్టు తరలిరావాలీ అంటే కేంద్ర స్థాయిలో చాలా పెద్ద కార్యక్రమం సాగాలి.
ఇక 2024లో అధికారంలోకి వచ్చిన టీడీపీ రాయలసీమకు హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేస్తామని చెబుతూ వచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలు అన్నీ ఒక కొలిక్కి వస్తున్న వేళ ఆదిలోనే అవాంతరం అన్నట్లుగా హైకోర్టులో ఒక పిల్ బెంచ్ కి వ్యతిరేకంగా దాఖలు అయింది. హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేసే అధికారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికే ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆ పిల్ లో పేర్కొన్నారు. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకమని కూడా స్పష్టం చేశారు.
అసలు కర్నూలుకు హైకోర్టు బెంచ్ కూడా అవసరం లేదని పిల్ లో చెప్పడం విశేషం. ఏపీ ఎపి పునర్విభజన చట్టం ప్రకారం బెంచ్ ఏర్పాటు ప్రతిపాదన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి రావాలే తప్ప, ప్రభుత్వం నుంచి కానే కాదని పిల్ లో పేర్కొన్నారు. రాజకీయ కారణాలతో లేదా భావోద్వేగాలతో బెంచ్ ని ఏర్పాటు చేయాలనుకోవడం సమంజసం కాదని పిల్ లో వెల్లడించారు.
ఇపుడు ఎంతో టెక్నాలజీ పెరిగిందని ఇ-ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్ వంటి సౌకర్యాలు ఉన్నాయని అందువల్ల బెంచ్ ఏర్పాటు అన్నది ప్రత్యేకంగా అవసరం లేదని కూడా అంటున్నారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం 1985లో జస్వంత్ సింగ్ కమిషన్ ఇచ్చిన నివేదికకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని కూడా పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ని ఏర్పాటు చేస్తే రేపటి రోజున విశాఖలో బెంచ్ కావాలని కోరుతారని ఇలా హైకోర్టుని విభజించుకుంటూ పోతారా అని కూడా ప్రశ్నిస్తూ పిల్ దాఖలు అయింది.
రాష్ట్ర సచివాలయంతో పాటు అసెంబ్లీ ఉన్న అమరావతిలోనే హైకోర్టు బెంచ్ ఉండడం నూరు శాతం సమంజసం అని కూడా పిల్ లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేయాలాని కోరుతూ ఈ పిల్ లో పేర్కొనడంతో హైకోర్టు బెంచ్ కర్నూలుకి వస్తుందా రాదా అన్నది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.