మాజీ భర్త పరువు తీసిన మహిళ!... రూ.15 లక్షలు చెల్లించమన్న కోర్టు!
అవును... తన మాజీ భర్తకు పరువు నష్టం కలగడానికి ఓ మహిళను బాధ్యురాలిని చేస్తూ ఢిలీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది
By: Tupaki Desk | 6 Aug 2024 11:30 AM GMTసమస్య స్త్రీకి సంబంధించిదైనా, పరువు పురుషుడికి సంబంధించిందైనా, వేదింపులు ఎవరు చేసినా, బాధితులు ఎవరైనా ప్రతీ ఒక్కరికీ చట్టం ముందు న్యాయం జరుగుతుంది! ఈ విషయంలో వివక్షకు ఆస్కారం లేదు అని చెప్పే ఎన్నో సంఘటనలు వెలుగు చూశాయి! ఈ క్రమంలో తాజాగా తన మాజీ భర్త పరువు తీసినందుకు ఓ మహిళ రూ.15 లక్షలు చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది.
అవును... తన మాజీ భర్తకు పరువు నష్టం కలగడానికి ఓ మహిళను బాధ్యురాలిని చేస్తూ ఢిలీ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అతనికి నష్టపరిహారంగా మాజీ భార్య రూ.15 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఆమెను బాధ్యురాలిని చేస్తూ దావా వేసినప్పటి నుంచీ 9శాతం వడ్డీతో కలిపి ఈ మొత్తం చెల్లించాలని తెలిపింది.
బార్ అండ్ బెంచ్.కాం ప్రకారం 2001లో వివాహం చేసుకున్న ఓ జంటకు 2021లో హిందూ వివాహ చట్టం - 1995 ప్రకారం పలు కారణాలతో ఫ్యామిలీ కోర్టు వివాహాన్ని రద్దు చేసింది. ఈ సందర్భంగా 2009లో తన మైనర్ కుమార్తెతో కలిసి భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని భర్త ఆరోపించాడు. ఈ సందర్భంగా అధికారులు, పలు కోర్టుల ముందు తప్పుడు ఆరోపణలు చేస్తూ తన పరువు తీసిందని పేర్కొన్నాడు!
ఇదే సమయంలో... తన కుమార్తెను కలవడానికి కూడా అనుమతించలేదని.. తండ్రిగా తన కుమార్తె ప్రేమను, ఆప్యాయతను దూరం చేసిందని మాజీ భర్త కోర్టులో పిటిషన్ వేశారు. పైగా... ఆమె తన స్నేహితులకు, తన ఇ-మెయిల్స్ ద్వారా చెప్పే విషయాల్లో తనకు, తన తల్లికి సంబంధించి చాలా అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించిందని సదరు మాజీ భార్త తెలిపాడు.
ఇదే సమయంలో ఆమె నిరంతర వేధింపుల కారణంగా... మార్చి 2022లో పెద్ద శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని.. దీనివల్ల తనకు రూ.6 లక్షలు ఖర్చయ్యిందని అతను వాదించాడు! మరోవైపు సదరు వ్యక్తి పెట్టిన కేసు తప్పుడుదని, పూర్తిగా నిరాధారమైనదని, దురుద్దేశంతో కూడుకున్నదని తనను వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మహిళ చెప్పింది.
ఈ సందర్భంగా తన మాజీ భర్త చూపించిన 2010నాటి చాట్ లు, 2020లో పంపిన మెయిల్స్ ఆధారంగా దావా పరిమితి నిషేధించబడిందని ఆమె పేర్కొంది. ఈ సందర్భంగా సదరు మాజీ భర్త తరుపున మీనాక్షి అగర్వాల్, ఆ మహిళ తరుపున న్యాయవాది ఫౌజీ సయీద్ వాదనలు వినిపించారు.
ఈ సందర్భంగా స్పందించిన సాకేత్ కోర్టు... పరువు నష్టం కేసులో ఆ మహిళను దోషిగా తేల్చింది. ఈ సందర్భంగా ఆమె మాజీ భర్తకు రూ.15 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఇదే సమయంలో... మహిళ ప్రవర్తన భర్తను గాయపరిచిందని, అతని వృత్తిపరమైన ఎదుగుదలను ప్రభావితం చేసినట్లు కనుగొనబడిందని పేర్కొంది.
ఇదే సమయంలో... ఈమెయిల్స్ తదితరాలను కోర్టు సాక్ష్యంగా పరిగణించిందని.. సాకేత్ జిల్లా కోర్టు జడ్జి సునీల్ బెనివాల్ స్పందించారు. ఈ దావా స్థాపించిన తేదీ నుంచి ఈ మొత్తం చెల్లించే తేదీ వరకూ 9శాతం వడ్డీతో కలిపి రూ.15 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.