అతగాడి ‘అతి’కి తిక్క కుదిర్చిన ఢిల్లీ హైకోర్టు!
కొన్నిసార్లు నిజామా? ఇలా కూడా చేస్తారా? అన్నట్లుగా కొన్ని ఉదంతాల్ని చూసినప్పుడు కలుగుతుంది.
By: Tupaki Desk | 15 March 2024 8:30 AM GMTకొన్నిసార్లు నిజామా? ఇలా కూడా చేస్తారా? అన్నట్లుగా కొన్ని ఉదంతాల్ని చూసినప్పుడు కలుగుతుంది. తాజాగా చోటు చేసుకున్న ఉదంతాన్ని చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే. సిత్రమైన డిమాండ్ తో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన ఒక వ్యక్తికి తిక్క కుదిరేలా ఫైన్ వేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఇంతకూ కోర్టు అంత సీరియస్ కావటానికి కారణం.. అతగాడి ‘అతి’ వాదనలే.
తాను బేస్వాన్ అవిభాజ్య రాజ్య వారసుడినని.. యమున, గంగా నదుల మధ్య భూమి మొత్తం తనదేనని మహేందర్ ధ్వజ్ ప్రసాద్ సింగ్ ఒక పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ సందర్భంగా తన వాదనను వినిపిస్తూ.. తాను బేస్వాన్ అవిభాజ్య రాజ్య వారసుడినని.. తాము 1947లో ఇండియన్ యూనియన్ లో తమ సంస్థానాన్ని కలపలేదన్నారు. అంతేకాదు.. 1950 తర్వాత తన భూములపై వసూలు చేసిన పన్నులన్నీ ప్రభుత్వం తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు.. తాను పేర్కొన్న ప్రాంతంలో లోక్ సభ.. రాజ్యసభ.. స్థానిక ఎన్నికల్ని కేంద్రం నిర్వహించకూడదని కోరారు. అతగాడి విచిత్ర వాదన ప్రకారం యమున.. గంగా నదుల మధ్య ప్రాంతమంటే.. అగ్రా.. మేరఠ్.. అలీగఢ్ తో పాటు ఢిల్లీ.. ఉత్తరాఖండ్.. గురుగ్రామ్ లోని 65 రెవెన్యూ ఎస్టేట్లకు తానే యజమానిగా పేర్కొన్నారు. ఇతగాడి వాదనలకు చిర్రెత్తుకొచ్చిన కోర్టు.. విలువైన సమయాన్ని వేస్టు చేసినందుకు రూ.లక్ష ఫైన్ విధిస్తూ అతగాడి పిటిషన్ ను కొట్టేసింది.