కాంగ్రెస్ కీలక పథకం నిలిచిపోతుందా? హైకోర్టులో కేసు
దీంతో ఆగ్రహం చెందిన నాగోల్ ప్రాంతానికి చెందిన హరేందర్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ కొని ఎక్కుతున్న పురుషులకు కనీసం సీటు కూడా కేటాయించలేక పోతున్నారని.
By: Tupaki Desk | 18 Jan 2024 5:30 AM GMTతెలంగాణలో రాక రాక అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పలు కీలక పథకాలను అమలు చేస్తోంది. దీనిలో ప్రధానంగా మహిళలకు ఉచితంగా ఆర్టీపీ ప్రయాణం. రాష్ట్రంలో ఎక్కడ నుంచి ఎక్కడకైనా.. నిర్ణీత గుర్తింపు కార్డు చూపించి.. మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. పార్టీ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే ఈ విధానాన్ని అమలు చేసేసింది. అయితే.. విధానం, పథకం రెండూ బాగానే ఉన్నా.. ఇది అతి స్వల్పకాలంలోనే వివాదాలకు కేంద్రంగా మారింది.
మహిళలు ఒకరిపై ఒకరు పడి కొట్టుకోవడం.. బస్సుల్లో కండెక్టర్లతోనూ వివాదాలకు దిగడం, చిన్నచిన్న అవసరాలకు కూడా బస్సులు వినియోగించడం.. వంటివి ప్రధాన వివాదాలుగా మారాయి. దీనిపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అనేక సందర్భాల్లో విన్నపాలు కూడా చేశారు. మరీ ముఖ్యంగా పురుషులు, టికెట్ కొని ఎక్కే వారికి కూడా సీట్లు లేకుండా పోయాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు టికెట్ కొని రావాలని అనుకున్న ప్రయాణికులకు.. కోదాడ వరకు(తెలంగాణ సరిహద్దుల వరకు) సీటు కేటాయించే పరిస్థితి కూడా లేకపోవడం గమనార్హం.
దీంతో ఆగ్రహం చెందిన నాగోల్ ప్రాంతానికి చెందిన హరేందర్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ కొని ఎక్కుతున్న పురుషులకు కనీసం సీటు కూడా కేటాయించలేక పోతున్నారని.. ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అందరికీ సమస్యగా మారిన ఈ ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని, పథకాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు. లింగ వివక్షకు దారి తీస్తున్న సెక్షన్ 47ను కూడా రద్దు చేయాలని ఆయన కోర్టుకు విన్నవించారు. అయితే.. దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించడం గమనార్హం. దీంతో ఈ పిటిషన్ ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది.
కోర్టు ఏం చేస్తుంది?
సాధారణంగా.. కోర్టులు ప్రభుత్వాల విధాన పరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోవు. చేసుకోకూడదు కూడా. ఈ మేరకు గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉన్నాయి. పైగా ఎన్నికల హామీ కావడంతో.. ఉచిత బస్సు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఈ పథకాన్ని రద్దు చేయాలని ఆదేశించే ఛాన్స్ కూడా లేదు. అయితే.. టికెట్ కొనుగోలు చేసి బస్సులు ఎక్కుతున్న వారికి ఇబ్బందులు లేకుండా.. కఠిన చర్యలు తీసుకోవాలని. .వారికి ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని మాత్రం ఆదేశించి.. అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో కొంత వరకు సమస్య తగ్గుతుందని భావించవచ్చు.