Begin typing your search above and press return to search.

మరోసారి హాట్‌ టాపిక్‌ గా మైనింగ్‌ కింగ్‌!

మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దన్‌ రెడ్డి గురించి తెలియని వారు ఎవరూ లేరు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 5:59 AM GMT
మరోసారి హాట్‌ టాపిక్‌ గా మైనింగ్‌ కింగ్‌!
X

మైనింగ్‌ కింగ్‌ గాలి జనార్దన్‌ రెడ్డి గురించి తెలియని వారు ఎవరూ లేరు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కర్ణాటక–ఆంధ్రా సరిహద్దుల్లో ఉన్న ఓబుళాపురం మైన్స్‌ మైనిం ద్వారా ఆయన పాపులర్‌ అయ్యారు. కేవలం కర్ణాటకలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆయన పాపులర్‌ అయ్యారు.

గతంలో కర్ణాటక బీజేపీ ప్రభుత్వంలో మంత్రిగా చక్రం తిప్పిన గాలి జనార్దన్‌ రెడ్డి ఆ తర్వాత అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో 2011లో జైలు పాలయ్యారు. దీంతో ఆయన తన ప్రాభవాన్ని కోల్పోయారు. బీజేపీ కూడా ఆయనను పట్టించుకోకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకొచ్చేశారు.

కర్ణాటక రాజకీయాల్లో మార్పు తీసుకొస్తానని గాలి జనార్దన్‌ రెడ్డి.. కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పేరుతో సొంతంగా పార్టీని ఏర్పాటు చేశారు. గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో తన పార్టీ తరఫున ఒంటరిగా పోటీ చేశారు. గాలి జనార్దన్‌ రెడ్డి గతంలో తాను పోటీ చేసి గెలుపొందిన బళ్లారి సిటీ నుంచి తన భార్య గాలి అరుణను బరిలోకి దింపారు. అయితే ఆమె ఓటమి పాలయ్యారు. మరోవైపు గాలి జనార్దన్‌ రెడ్డి గంగావతి నియోజకవర్గం నుంచి బరిలో దిగి విజయం సాధించారు.

గతేడాది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్దన్‌ రెడ్డి ఒక్కరే గెలుపొందారు. ఆయన పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ తరఫున పోటీ చేసిన వారంతా ఓటమి పాలయ్యారు.

ఈ నేపథ్యంలో గాలి జనార్దన్‌ రెడ్డి మళ్లీ తన మాతృ బీజేపీలో చేరారు. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో తన పార్టీని బీజేపీలో విలీనం చేశారు.

కాగా మైనింగ్‌ తవ్వకాలకు సంబంధించి జైలు పాలయినప్పుడు కోర్టు ఆయనను బళ్లారిలో అడుగుపెట్టొద్దని చెప్పింది. ఇప్పుడు 13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బళ్లారిలో అడుగుపెట్టడానికి గాలి జనార్దన్‌ రెడ్డికి కోర్టు అనుమతినిచ్చింది. ఆయన అక్కడ పర్యటించకుండా ఉన్న ఆంక్షలను ఎత్తేసింది.

గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించి 2011, సెప్టెంబర్‌ 5న సీబీఐ గాలి జనార్దన్‌ రెడ్డిని అరెస్టు చేసింది. మూడేళ్లకు పైగా హైదరాబాద్, బెంగళూరు జైళ్లలో ఆయన శిక్ష అనుభవించారు. అనంతరం కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అయితే బళ్లారి, ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలకు వెళ్లకుండా కోర్టు ఆంక్షలు విధించింది. అప్పట్నుంచి గాలి జనార్దన్‌ రెడ్డి గంగావతి, బెంగళూరుల్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు తన సొంత జిల్లా బళ్లారిలో పర్యటించడానికి ఆంక్షలు తొలగిపోయాయి.