Begin typing your search above and press return to search.

ఎక్కువ సంతానం.. అనర్హత రూల్ తీసేయాలన్న పిటిషన్ కు ఫైన్

అందుకు తగ్గట్లు.. ఇద్దరు పిల్లలకు పరిమితమైతే వారికి ప్రోత్సహాకాల్ని అందించే కార్యక్రమాల్ని చేపట్టటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   4 March 2025 7:00 PM IST
ఎక్కువ సంతానం.. అనర్హత రూల్ తీసేయాలన్న పిటిషన్ కు ఫైన్
X

ఓ వైపు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పిల్లల్ని కనాలని.. సంతానాన్ని పెంచాలని.. కుటుంబాల్ని పెద్దవి చేసుకోవాలన్న మాటను తరచూ వినిపిస్తూ ఉన్నారు. గతంలో పిల్లలు ఎక్కువ వద్దని.. ఒకరు ముద్దు అని.. ఇద్దరు చాలన్న మాటను పదే పదే ప్రచారం చేసేవారు. అందుకు తగ్గట్లు.. ఇద్దరు పిల్లలకు పరిమితమైతే వారికి ప్రోత్సహాకాల్ని అందించే కార్యక్రమాల్ని చేపట్టటం తెలిసిందే.

చివరకు స్థానిక సంస్థలకు జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం వద్దని.. ఒకవేళ ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే.. వారికి ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారు పంచాయితీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తున్న నిబంధనను రద్దు చేయాలని కోరుతూ ఒక ప్రజావాజ్యం పిటిషన్ దాఖలైంది. దీన్ని హైకోర్టు కొట్టేసింది.

ఎక్కువ సంతానం ఉంటే పోటీ చేయకుండా అడ్డుకుంటున్న పంచాయితీరాజ్ చట్టం సెక్షన్ 21(3) లో పేర్కొన్న నిబంధనల్ని రద్దు చేయాలని నల్గొండ జిల్లాకు చెందిన నాగరాజు హైకోర్టును ఆశ్రయంచారు. ఈ పిటిషన్ పై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజాయ్ పాల్.. జస్టిస్ రేణుక ధర్మాసనం విచారణ జరిపింది. ఇలాంటి పిటిషన్లను గతంలో కోర్టులో కొట్టేసిన నేపథ్యంలో దీన్ని తిరస్కరించినట్లుగా ధర్మాసనం పేర్కొంది.

అంతేకాదు.. తీర్పును వెలువరించే వేళ పిటిషనర్ తరఫు న్యాయవాది పదే పదే కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కల్పించటంపై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి చర్యల్ని తప్పు పడుతూ రూ.25 వేల జరిమానాను విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.