పార్టీ ఫిరాయింపు కేసులో హైకోర్టు సంచలన తీర్పు
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
By: Tupaki Desk | 22 Nov 2024 6:33 AM GMTపార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ తీర్పుతో పార్టీ వారికి బిగ్ రిలీఫ్ దొరికింది. దీంతో ఈ తీర్పు చర్చకు దారితీసింది.
గత ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి ఆ తరువాత కాంగ్రెస్‌లోకి వెళ్లిన వారిపై అనర్హత వేటువేయాలని గులాబీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని కోరుతూ కూకట్‌పల్లి ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్లు వేశారు. స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కోర్టుకు వెళ్లారు. అనర్హతపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులున్నా పరిగణలోకి తీసుకోవడం లేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది.
ఈ సందర్భంగా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ గూటికి చేరారు. వీరిపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించగా.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై నాలుగు వారాల్లోగా టైం ఫ్రెమ్ ఫిక్స్ చేయాలంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం వినోద్ కుమార్‌కు సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. అయితే.. వీటిని సవాల్ చేస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ చేశారు. రిట్ అప్పీల్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఈ రోజు కీలక తీర్పునిచ్చింది.
ఈ విషయంలో స్పీకరే తుది తీర్పు తీసుకోవాలని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది. స్పీకర్‌కు ఎలాంటి టైం బాండ్ లేదని హైకోర్టు అభిప్రాయపడింది. రీజనబుల్ టైంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేసింది. 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. అసెంబ్లీ ఐదేళ్ల గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడింది.