హైడ్రాను రద్దు చేస్తాం.. హైకోర్టు సంచలనం!
నిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
By: Tupaki Desk | 21 Feb 2025 6:22 AM GMTనిర్మాణాల కూల్చివేతల విషయంలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99ను ఉల్లంఘిస్తే, దాన్ని రద్దు చేసి హైడ్రాను మూసివేయాల్సి వస్తుందని హెచ్చరించింది. వ్యక్తిగత కక్షల కారణంగా కొందరు హైడ్రాను ఉపయోగించుకుని ఆరోపణలు చేస్తున్నారని, అవి మాత్రమే ఆధారంగా కూల్చివేతలు చేపట్టడం సరికాదని వ్యాఖ్యానించింది.
హక్కులను నిర్ధారించకుండా కేవలం పత్రాల ఆధారంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నిస్తూ, హక్కులను తేల్చే అధికారం హైడ్రాకు ఎక్కడుందని హైకోర్టు నిలదీసింది. కూల్చివేతకు ముందు నోటీసులు ఇచ్చి వివరణకు తగిన గడువు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఎన్నిసార్లు చట్ట ప్రకారం వ్యవహరించాలని చెప్పినా హైడ్రా తీరులో మార్పు ఎందుకు కనిపించడంలేదని మండిపడింది.
- హైకోర్టులో పిటిషన్ విచారణ
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముతంగి గ్రామానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి తన స్థలానికి సంబంధించిన వివరాలను పరిశీలించకుండా షెడ్‌ను కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును జస్టిస్ కె. లక్ష్మణ్ విచారించారు.
హైకోర్టు ఆదేశాల మేరకు హైడ్రా ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ వ్యక్తిగతంగా హాజరయ్యారు. పార్క్ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనే ఫిర్యాదు మేరకు గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఫిర్యాదు అందినట్లు హైడ్రా తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2023 నవంబరు 15న పంచాయతీ అనుమతులు మంజూరు చేసినప్పటికీ, వాటిని రద్దు చేసి కూల్చివేతలు చేపట్టినట్లు వెల్లడించారు.
గతంలో బెదిరించి అనుమతులు పొందారని, అందువల్లే వాటిని రద్దు చేయాల్సి వచ్చిందని హైడ్రా తరఫు న్యాయవాది కటిక రవీందర్ రెడ్డి కోర్టుకు వివరించారు. సుప్రీం కోర్టు కూడా రోడ్లకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను కూల్చివేయాలని పేర్కొన్నదని పేర్కొన్నారు. అయితే, హైకోర్టు ఈ వాదనలను తీవ్రంగా ప్రశ్నించింది.
- హైకోర్టు కీలక వ్యాఖ్యలు
"2023లో అనుమతులు ఇచ్చి, 2025లో అవి రద్దు చేయడం ఎలా సమర్థనీయం?" అని న్యాయమూర్తి నిలదీశారు. గత విచారణలో ఈ ఉత్తర్వులను సమర్పించలేదని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు హైడ్రా అధికారులు పేర్కొనగా, అదే అసోసియేషన్ హైడ్రా రాక ముందు ఎందుకు ఫిర్యాదు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. పార్కు ఆక్రమణ జరుగుతుంటే ముందుగా ఎందుకు స్పందించలేదని నిలదీసింది.
హైకోర్టు, "హైడ్రా భుజాలపై తుపాకీ పెట్టి పేలుస్తున్నారు" అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పార్కు స్థలంలో నిర్మాణం చేపట్టారనే నిర్ధారణ ఎలా చేసారనీ, హక్కులను నిర్ణయించాల్సింది సివిల్ కోర్టు కాదా?" అని ప్రశ్నించింది.
పిటిషనర్‌ను కబ్జాదారుడిగా ఎలా పేర్కొంటారని, కబ్జాదారుని నిర్ణయించే అధికారం హైడ్రాకు ఎక్కడుందని హైకోర్టు నిలదీసింది. "నిజాయితీగా వ్యవహరించకుండా అక్రమంగా వ్యవహరిస్తే, హైడ్రాను మూసివేయాల్సి వస్తుంది" అని హెచ్చరించింది.
ప్రస్తుతం పిటిషనర్ స్థలంలో యథాతథ పరిస్థితిని కొనసాగించాలని ఆదేశిస్తూ, హైడ్రా పూర్తిగా వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను మార్చి 5వ తేదీకి వాయిదా వేసింది.