శబరిమలలో నటుడికి వీఐపీ దర్శనం.. హైకోర్టు సీరియస్
అయితే.. ఈ ఉదంతంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అంతేకాదు.. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేయటం ఇప్పుడు సంచలనమైంది.
By: Tupaki Desk | 7 Dec 2024 4:55 AM GMTప్రముఖ ఆలయాలకు వెళ్లే సినీ నటులు.. సెలబ్రిటీలకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించటం.. వారిని వీఐపీలుగా ట్రీట్ చేస్తూ.. సాధారణ భక్తుల దర్శనాన్ని నిలిపేయటం మామూలే. ఇలాంటి సీనే తాజాగా శబరిమలలో అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చిన సినీ నటుడి విషయంలోనూ జరిగింది. అయితే.. ఈ ఉదంతంపై హైకోర్టు సీరియస్ అయ్యింది. అంతేకాదు.. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేయటం ఇప్పుడు సంచలనమైంది.
మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు పొందిన దిలీప్ గురువారం అయ్యప్పస్వామిని శబరిమలలో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు వీఐపీ దర్శనం ఏర్పాట్లు చేసింది. అదే సమయంలో సాధారణ భక్తులు పెద్ద ఎత్తున క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. ఇలాంటి వేళలో నటుడికి ఇచ్చిన వీఐపీ దర్శనంపై మీడియాలో వార్తలు వచ్చాయి.
వీటిపై స్పందించిన కేరళ హైకోర్టు ఈ అంశాన్ని సుమోటోగా తీసుకొని విచారణ చేపట్టింది. ఆ నటుడు అంతసేపు ఆలయంలో ఉండటానికి ఎలా అనుమతించారు? అంటూ హైకోర్టు ప్రశ్నించింది. సదరు నటుడి కారణంగా పిల్లలు.. పెద్ద వయస్కులతో సహా అందరూ ఇబ్బంది పడినట్లుగా పేర్కొన్నారు. ఆలయ యాజమాన్యమే ఇలా ప్రవర్తిస్తే.. భక్తులు ఎవరికి కంప్లైంట్లు చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులకు మాత్రమే వీఐపీ దర్శనం ఉంటుందని.. ఇతరులకు ఆ అవకాశం కల్పించటం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ ఉదంతంపై పోలీసులు విచారణ జరిపి.. శనివారంలోపు వీడియో పుటేజ్.. రిపోర్టును కోర్టుకు సమర్పించాలంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరేంద్రన్.. జస్టిస్ మురళీ క్రిష్ణలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. అంతేకాదు.. వీఐపీ దర్శనం చేసుకున్న నటుడు దిలీప్ ను ప్రతివాదిగా చేర్చాలన్న డిమాండ్ మీదా పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు పేర్కొనటం గమనార్హం.