Begin typing your search above and press return to search.

పిన్నెల్లి కేసులపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఏముంది?

అంతేకాదు..ఆయన తన పాస్ పోర్టును అప్పగించాలని.. దేశం దాటి వెళ్లొద్దన్న ఆంక్షల్ని విధించింది.

By:  Tupaki Desk   |   29 May 2024 5:21 AM GMT
పిన్నెల్లి కేసులపై ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో ఏముంది?
X

పోలింగ్ సందర్భంగా పోలింగ్ స్టేషన్ లోకి వెళ్లి.. ఈవీఎంను ధ్వంసం చేసిన ఉదంతం.. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై నమోదు చేసిన కేసుతో పాటు.. పోలింగ్ సందర్భంగా ఏర్పడిన హింసకు సంబంధించి మరిన్ని కేసులు నమోదయ్యాయి. వీటిలో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధం కాగా.. ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.ఈ నేపథ్యంలో ఆయన్ను జూన్ ఆరు వరకు అరెస్టు చేయొద్దని పేర్కొనటంతో పాటు షరతులతో కూడిన మధ్యంతర ఉత్తర్వుల్ని జారీ చేసింది.

అరెస్టుతో పాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు విస్పష్ట ఆదేశాలు ఇచ్చిన ఏపీ హైకోర్టు.. పల్నాడు ఎస్పీ కార్యాలయానికి మాత్రం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు హాజరై.. సంతకం పెట్టాలని చెప్పింది. నరసరావుపేటను దాటి వెళ్లొద్దని.. ఆ ఊళ్లో ఎక్కడ ఉంటున్నారో పల్నాడు ఎస్పీకి తెలియజేయాలని స్పష్టం చేసింది.

అంతేకాదు..ఆయన తన పాస్ పోర్టును అప్పగించాలని.. దేశం దాటి వెళ్లొద్దన్న ఆంక్షల్ని విధించింది. కోర్టు విధించిన షరతుల్ని ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకోవటానికి పోలీసులకు వెసులుబాటు కల్పించింది. పోలింగ్ సందర్భంగా పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేయటం.. అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై హత్యాయత్నం చేయటం.. తనను నిలదీసిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను తీవ్ర పదజాలంతో దుర్భాషలాడటం.. పోలింగ్ తర్వాతి రోజు తన సోదరుడు.. అనుచరులతో కలిసి కారంపూడిలో చేపట్టిన కార్యక్రమాలు.. వీటిని అడ్డుకోబోయిన సీఐపై దాడి చేసి గాయపర్చిన ఘటనల్లో వివిధ సెక్షన్ల కింద మూడు కేసులు నమోదు చేయటం తెలిసిందే.

ఈ కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి.. ఆయనకు బెయిల్ ఇవ్వొద్దంటూ పోలీసుల తరఫు లాయర్లు వాదించారు. అయితే.. ఓట్ల లెక్కింపు కోసం కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవాల్సి ఉంటుందని.. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి తరఫు లాయర్లు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఆయనకు జూన్ ఆరు వరకు రక్షణ కల్పిస్తూ.. హైకోర్టు మధ్యంతర ఆదేశాల్ని జారీ చేశారు. ఈ సందర్భంగా పలు షరతుల్ని విధించారు. ఏపీ హైకోర్టు విధించిన షరతుల్ని చూస్తే..

- పిన్నెల్లి కదలికలపై పోలీసు అధికారులతో పూర్తి స్థాయిలో నిఘా ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని ఎన్నికల సంఘానికి ఆదేశం

- ఎలాంటి నేర కార్యకలాపాల్లో జోక్యం చేసుకోకూడదు.

- నేర ఘటనల్ని రిపీట్ చేయకూడదు.

- జిల్లాలో శాంతి భద్రతల సమస్యను క్రియేట్ చేయొద్దు

- తన అనుచరుల్ని నియంత్రించే బాధ్యత ఆయనదే. ఆ ప్రాంతంలో ప్రశాంతతకు.. బాధితులకుఏ విధమైన అవరోధాలు కలిగించే ప్రయత్నాలు చేయకుండాచూసుకోవాల్సి ఉంటుంది. అది.. ఆయన బాధ్యత.

- తనపై నమోదైన కేసులపై తన పాత్రను మీడియాలో మాట్లాడకూడదు.

- బాధితుల్ని. . సాక్ష్యుల్ని కలిసేందుకు వీల్లేదు. వారిని ప్రభావితం చేయటం.. భయపెట్టటం లాంటివి చేయకూడదు.

- నరసరావుపేటలోనే ఉండాలి. ఓట్ల లెక్కింపు కేంద్రం మరో చోట అయితే.. ఓట్ల లెక్కింపు రోజు మాత్రమే అక్కడకు వెళ్లాల్సి ఉంటుంది.

- గురజాల మేజిస్ట్రేట్ కోర్టులో పాస్ పోర్టును అప్పగించాలి. కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదు.

- బాధితులకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. వారికి రక్షణగా సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి.