Begin typing your search above and press return to search.

మొండితనం వీడి రాజీ పడండి.. ఆ ఇద్దరు మహిళా అధికారులకు కోర్టు సూచన

సంచలనాలు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నడిచే ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న లొల్లి.. కర్ణాటక హైకోర్టు వరకు వెళ్లటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Jan 2024 5:39 AM GMT
మొండితనం వీడి రాజీ పడండి.. ఆ ఇద్దరు మహిళా అధికారులకు కోర్టు సూచన
X

ఇద్దరు ఇద్దరే అన్నట్లుగా అనిపిస్తారు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి.. ఐపీఎస్ అధికారిణి రూపా మౌద్గిల్. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని కొంతకాలం క్రితం చెలరేగిపోయిన వీరి ఎపిసోడ్ పుణ్యమా అని..దేశ వ్యాప్తంగా అందరి నోటహాట్ టాపిక్ అయ్యారు. సాధారణంగా ఐఏఎస్.. ఐపీఎస్ అధికారుల వ్యక్తిగత జీవితాలు.. వారి అభిరుచులు సంచలనంగా మారటమే కాదు.. వార్తాంశాలుగా మారే పరిస్థితిని తీసుకొచ్చారు ఈ ఇద్దరు మహిళా అధికారులు.

సంచలనాలు.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నడిచే ఈ ఇద్దరి మధ్య నడుస్తున్న లొల్లి.. కర్ణాటక హైకోర్టు వరకు వెళ్లటం తెలిసిందే. తనను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టుల పెట్టిన ఐపీఎస్ అధికారి రూపా డి మౌద్గల్ సారీ చెప్పటంతో పాటు.. రూ.కోటి ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి. కర్ణాటకలో పని చేసే ఈ ఇద్దరు మహిళా అధికారుల మధ్య నడుస్తున్న వివాదం కోర్టు ముందుకు వెళ్లటం.. తాజాగా ఈ కేసువిచారణను జరిపిన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇద్దరు అధికారిణులు కీలక స్థానాల్లో ఉన్నారని.. ఉజ్వల భవిష్యత్తు ఉందని.. ఒకసారి ఆలోచించి.. సమస్యను పరిష్కరించుకోవాలని.. మొండి పట్టుదలతో దేన్నీ సాధించలేమని పేర్కొనటంతో పాటు.. ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని నెల రోజుల్లో ప్రశాంతంగా పరిష్కరించుకోవాలన్నకీలక సూచన చేసింది.

అంతేకాదు.. ‘ఉన్నత స్థానాల్లో ఉన్న మీరే ఇలా కించపర్చుకుంటూ.. గొడవలకు దిగటం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నట్లు? అంటూ కోర్టు పేర్కొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు ఉండవన్న కోర్టు.. ఇద్దరికి నెల రోజులు గడువు ఇస్తూ కేసును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు చేసిన సూచనపై ఈ ఇద్దరు మహిళా అధికారులు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.