నా భార్య 8 మందిని పెళ్లి చేసుకుంది.. కాదు నలుగురే అంటూ లాయర్ ట్విస్ట్
తన భార్య ఎనిమిది మందిని పెళ్లి చేసుకుందని ఓ భర్త కోర్టు మెట్లెక్కాడు.
By: Tupaki Desk | 12 Sep 2024 7:20 AM GMTతన భార్య ఎనిమిది మందిని పెళ్లి చేసుకుందని ఓ భర్త కోర్టు మెట్లెక్కాడు. అందరిని మోసం చేస్తూ పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుందని కోర్టులో పేర్కొన్నాడు. అయితే.. దీనిపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా బాధితురాలి తరఫు న్యాయవాది చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. అందరినీ విస్తుగొలిపే ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
కర్ణాటకలోని హోస్పేట్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య 8 మందిని పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశాడు. తనతో పెళ్లికి ముందే ఆమెకు వివాహాలు అయ్యాయని పేర్కొన్నాడు. అన్ని చేసి మళ్లీ తనపైనే గృహ హింస కేసు పెట్టిందని.. వెంటనే దానిని కొట్టివేయాలని అభ్యర్థించాడు.
ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగుతుండగా బాధితురాలి తరఫున వాదించిన న్యాయవాది సంచలన వ్యాఖ్యలు చేశాడు. మహిళ భర్త ఆరోపిస్తున్నట్లు ఆమె 8 మందిని పెళ్లిళ్లు చేసుకోలేదని. కేవలం నలుగురినే వివాహం ఆడిందని చెప్పుకొచ్చారు. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అంతేకాదు.. అలా ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరించడం ప్రారంభించాడు.
ఇదిలా ఉండగా.. ఇంతకుముందు విచారణలో కోర్టుకు ఐదుగురు వ్యక్తులు హాజరై తమనూ ఆమె మోసం చేసిందని చెప్పుకొచ్చారు. గతంలో తమను పెళ్లిచేసుకుందని న్యాయమూర్తి ఎదుట వివరించారు. అప్పుడు సమయాభావం వల్ల న్యాయమూర్తి కేసును వాయిదా వేశారు. తాజా విచారణలో ఆ ఐదుగురితోపాటు మరో ముగ్గురు వ్యక్తులు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో జస్టిస్ విస్మయం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో.. తన క్లయింట్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కేవలం నలుగురితోనే ఆమెకు వివాహం అయిందని లాయర్ చెప్పారు.
మొదటి వివాహం చేసుకున్న తరువాత భర్త చనిపోయాడని, దాంతో మరొకరిని పెళ్లి చేసుకుందని వివరించాడు. చట్టం ప్రకారం విడాకులు తీసుకొని మిగితా వారిని పెళ్లి చేసుకుందని చెప్పాడు. ఈ వాదనలు విన్న జస్టిస్.. ఇరుపక్షాలకూ నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. అప్పటిలోగా విచారణ పూర్తి చేసి.. అన్ని ఆధారాలు వెల్లడించాలని ఆదేశించారు. కేసు వినడానికే అదో మాదిరి ఉంటే.. లాయర్ చేసిన వ్యాఖ్యలతో ఈ కేసు చర్చకు దారితీసింది. అటు న్యాయవర్గాల్లోనూ ఈ కేసు మరింత ఆసక్తి కలిగించింది. ఇదిలా ఉంటే.. దర్యాప్తు ద్వారానే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు చెబుతున్నారు.