భార్యను చదువు మానేయమనడంపై కోర్టు సంచలన తీర్పు!
భార్యభర్తల విడాకులకు సంబంధించిన కేసుల్లో వారి వివాహం రద్దు కావడానికి పలు రకాల కారణాలుంటాయనే సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 8 March 2025 11:47 AM ISTభార్యభర్తల విడాకులకు సంబంధించిన కేసుల్లో వారి వివాహం రద్దు కావడానికి పలు రకాల కారణాలుంటాయనే సంగతి తెలిసిందే. అ కారణాల్లో తాజాగా.. భార్యను చదువును ఆపమని బలవంతం చేయడం చేరిందని చెప్పొచ్చు! ఈ సమయంలో.. ఒక వ్యక్తి తన భార్యను చదువును ఆపమని బలవంతం చేయడంతో.. వారి వివాహాన్ని కోర్టు రద్దు చేసింది.
అవును... తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక వివాహాన్ని రద్దు చేసింది. ఇందులో భాగంగా... ఒక వ్యక్తి తన భార్యను చదువు ఆపమని బలవంతం చేయడం, ఆమె కలలను నాశనం చేయడంతో సమానం అని.. చదువుకొని లేదా తనను తాను మెరుగుపరుచుకోవడానికి ఇష్టపడని వ్యక్తితో జీవించమని ఒత్తిడి చేయడం మానసిక క్రూరత్వానికి సమానమని పేర్కొంది.
హైకోర్టు ఇండోర్ బెంచ్.. ఒక మహిళ పిటిషన్ ఆధారంగా ఆమె వివాహాన్ని రద్దు చేస్తూ ఈ వాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... విద్య అంటే జీవితానికి సిద్ధం కావడం మాత్రమే కాదు.. అది జీవితమే అని అమెరికన్ తత్వవేత్త జాన్ డ్యూయి చెప్పిన కోట్ ను ఇక్కడ ఉదహరించింది!
వివరాల్లోకి వెళ్తే... తన భర్తతో విడిపోవాలని ఓ మహిళ షాజాపూర్ జిల్లాలోని ఫ్యామిలీ కోర్టును అభ్యర్థించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో.. ఆ మహిళ హైకోర్టులో అప్పీల్ చేసింది. తన అప్పీల్ లో 12వ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత 2015లో షాజాపూర్ కు చెందిన వ్యక్తిని వివాహం చేసుకున్నట్లు పేర్కొంది.
అయితే.. వివాహం తర్వాత ఆమె చదువు కొనసాగించాలని కోరగా.. అందుకు ఆమె అత్తమామలు అంగీకరించలేదు. భర్త కూడా తిరస్కరించారు! ఈ నేపథ్యంలో కేసు వివరాలు, ఇరువైపుల వాదనలు పరిశీలించిన తర్వాత.. ఫ్యామిలీ కోర్టు ఆదేశాలను జస్టిస్ వివేక్ రుసియా, జస్టిస్ గజేంద్ర సింగ్ లతో కూడిన డివిజన్ బెంచ్ రద్దు చేసింది.
ఈ సందర్భంగా సదరు మహిళ విజ్ఞప్తిని ఆమోదించిన హైకోర్టు.. హిందూ వివాహ చట్టంలోని నిబంధనల ప్రకారం ఆమె వివాహాన్ని రద్దు చేసింది.