మాజీ సీఎం జగన్ కు బిగ్ రిలీఫ్ : రఘురామ పిటిషన్ల తిరస్కరణ
By: Tupaki Desk | 27 Jan 2025 8:05 AM GMTమాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి సుప్రీం కోర్టులో గొప్ప ఊరట దక్కింది. జగన్ బెయిల్ రద్దు, ఆయనపై నమోదైన కేసులను సత్వరమే విచారించాలని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ రాజు వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జగన్ కేసులను ప్రత్యేకంగా విచారించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో తన పిటిషన్లను వెనక్కి తీసుకుంటానని రఘురామరాజు కోర్టుకు విన్నవించారు.
అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయాలని, కేసుల విచారణను మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామక్రిష్ణం రాజు సుప్రీం కోర్టులు పిటిషన్ వేశారు. దీనిపై గతంలో అనేక సార్లు విచారణ జరిగింది. సోమవారం మరోసారి ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర మిశ్రా ధర్మాసనం బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ అవసరం లేదని అభిప్రాయపడింది. దీంతో హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషన్ ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది కోర్టు అనుమతి కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరించింది.
మరోవైపు ట్రయల్ వేగంగా సాగాలని, మరో రాష్ట్రానికి బదిలీ చేయాలన్న పిటిషన్ పైనా ధర్మాసనం ఆదేశాలిచ్చింది. జగన్ అక్రమాస్తుల కేసేను తెలంగాణ హైకోర్టు పర్యవేక్షిస్తుందని, గతంలో ప్రజాప్రతినిధుల కేసులను రోజువారీగా విచారించాలని సుప్రీం ఇచ్చిన తీర్పు ఈ కేసుకూ వర్తిస్తుందని తెలిపింది. ట్రయల్ కోర్టు ఈ కేసును రోజువారీ విచారించాలని, హైకోర్టు పర్యవేక్షించాలని ఆదేశిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. రోజువారీ విచారణ జరగనున్నందున కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.