Begin typing your search above and press return to search.

ప్రత్యేక హోదాపై కోర్టులో కీలక పరిణామం... ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో?

ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం 2014 నుంచి ఎన్నికల్లో నేతలకు ఓట్లకు వరంలా మారిన సంగతి తెలిసిందే!

By:  Tupaki Desk   |   28 Nov 2024 5:45 AM GMT
ప్రత్యేక హోదాపై కోర్టులో కీలక పరిణామం... ఇప్పుడు బంతి ఎవరి కోర్టులో?
X

ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశం 2014 నుంచి ఎన్నికల్లో నేతలకు ఓట్లకు వరంలా మారిన సంగతి తెలిసిందే! ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారో ఇవ్వరో కేంద్రంలో వరుసగా మూడో దఫా అధికారంలో ఉన్న బీజేపీ చెప్పదు.. కానీ, ఏపీ రాజకీయ నాయకులు మాత్రం దీనిపై హామీలు ఇస్తూనే ఉన్నారు. ఈ సమయంలో కేఏ పాల్ వేసిన పిటిషన్ లో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది.

అవును... ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలి అని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో పిల్ వేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వాదనలు వినిపిస్తూ పాల్... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చారని.. హోదా ఇస్తే పెట్టుబడులు వచ్చి.. ప్రజలకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రం లక్షల కోట్ల అప్పులో ఉందని, ఖజానా ఖాళీ అయ్యిందని పలుమార్లు సీఎం ప్రకటనలు చేశారని.. ఈ పిల్ పై కౌంటర్ వేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించినా ఇప్పటికీ దాఖలు చేయలేదని అన్నారు! హోదాను రాష్ట్రం కోరుకుంటుందా.. కేంద్రం అందుకు సుముఖంగా ఉందా అనే విషయాలపై కౌంటర్ వేసేలా ఆదేశించాలని కోరారు!

దీనిపై స్పందించిన ధర్మాసనం.. వ్యాఖ్యల్లో కౌంటర్ వేయాలా లేదా అనేది ప్రభుత్వాల విశేషాధికారం అని తెలిపింది. ఈ నేపథ్యంలో... ప్రత్యేక హోదా విషయంలో రాతపూర్వక హామీ ఏమైనా ఉందా అని కేంద్రాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై.. కేంద్ర ప్రభుత్వం తరుపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ స్పందిస్తూ.. రాతపూర్వక హామీ ఏమీ లేదని.. పార్లమెంటులో ప్రకటన మాత్రమే ఉందని అన్నారు!

ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల ఎవరికి నష్టం? ఇస్తే ఎమి లాభం? అనేది వివరిస్తూ అఫిడవిట్ వేయాలని కేఏ పాల్ ను హైకోర్టు ఆదేశించింది. విచారణను డిసెంబర్ 11కు వాయిదా వేసింది. దీంతో... ఈ సమయంలో ప్రత్యేక హోదాపై ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఈసారి కచ్చితంగా తెరపైకి వచ్చే అవకాశం ఉందనే చర్చ తెరపైకి వచ్చింది.