Begin typing your search above and press return to search.

కాళేశ్వరం... అనుమతిస్తే రెడీ అంటున్న సీబీఐ!?

ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ... ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   27 Jan 2024 7:53 AM GMT
కాళేశ్వరం... అనుమతిస్తే రెడీ అంటున్న సీబీఐ!?
X

కాళేశ్వరం ప్రాజెక్టు... తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత బలంగా వినిపించిన పేరు! ఈ ప్రాజెక్టు పేరు చెప్పి గత ప్రభుత్వంలోని పెద్దలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్ నేతలు బలంగా వినిపించారు. ఇక అధికారంలోకి వచ్చిన అనంతరం ఈ ప్రాజెక్ట్ లో జరిగినట్లు వినిపిస్తున్న అవకతవకల ఆరోపణలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయమే తీసుకుంది. ఈ సమయంలో తాజాగా సీబీఐ ఎంటరైంది.. అనుమతిస్తే రెడీ అంటుంది.

అవును... కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలు జరిగాయంటూ వినిపిస్తున్న ఆరోపణలపై విచారణ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్ వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టుకు వెల్లడించింది. ఇందులో భాగంగా... హైకోర్టుగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదేశిస్తే విచారణ చేస్తామని ప్రకటించింది. దీంతో... తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు దర్యాప్తుపై హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేసిన సీబీఐ... ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా విచారణకు అవసరమైన వనరులు, సౌకర్యాలు ప్రభుత్వం కల్పించాలని కోరింది. ఇందులో భాగంగా ప్రధానంగా... ఒక అదనపు ఎస్పీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్స్‌పెక్టర్లు, నలుగురు ఎస్‌ఐ లతో పాటు ఇతర సిబ్బంది కావాలని కోరింది. దీంతో... ఈ విషయంపై విచారణను ఫిబ్రవరి 2వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.

కాగా... కాళేశ్వరంలో అవినీతిపై దర్యాప్తు చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ సీబీఐ నుంచి ఎటువంటి స్పందనా లేదంటూ న్యాయవాది రామ్మోహన్‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో... సీబీఐ హైదరాబాద్‌ విభాగం హెడ్‌ కళ్యాణ్‌ చక్రవర్తి తన కౌంటర్‌ దాఖలు చేశారు. ఇందులో భాగంగా... కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులను రుణాలుగా ఇచ్చిన బ్యాంకుల నుంచి కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని హైకోర్టుకు తెలిపారు.

ఇదే సమయంలో... కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ వస్తున్న ఆరోపణలపై నేరుగా జోక్యం చేసుకుని దర్యాప్తు చేసే విషయంలో తమకు కొన్ని పరిమితులు ఉన్నాయని.. దాన్ని దష్టిలో పెట్టుకుని ఫిర్యాదులపై స్పందించలేదని కౌంటర్‌ లో కళ్యాణ్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో... దీనిపై విచారణను తెలంగాణ హైకోర్టు వచ్చే నెల 2కి వాయిదా వేసింది. ఈ విషయంపై రేవంత్ సర్కార్ ఎలా స్పందించబోతుందనేది వేచి చూడాలి.