Begin typing your search above and press return to search.

సిద్ధరామయ్యకు హైకోర్టు బిగ్ షాక్.. సీఎం కుర్చీ నుంచి దిగాల్సిందేనా?

అహింద సిద్ధాతంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసిన సిద్ధరామయ్యకు తీవ్ర పోటీ అనంతరం రెండోసారి సీఎం పదవి దక్కంది.

By:  Tupaki Desk   |   24 Sep 2024 7:36 AM GMT
సిద్ధరామయ్యకు హైకోర్టు బిగ్ షాక్.. సీఎం కుర్చీ నుంచి దిగాల్సిందేనా?
X

పెద్ద రాష్ట్రమే అయినా.. చిన్న రాష్ట్రాల తరహాలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంటుంది కర్ణాటకలో.. ఓవైపు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రభావం అధికమే అయినా.. జేడీఎస్ వంటి ప్రాంతీయ పార్టీ కూడా సత్తా చాటుతుంటుంది. అలాంటి కర్ణాటకలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం వేలాది కోట్లు డెవలప్ మెంట్ కు కుమ్మరించినా.. ఎన్నో ఎత్తులు వేసినా.. కర్ణాటకలో బీజేపీని గెలిపించలేకపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అవినీతి ఆరోపణలు, అసమర్థతతో ఓటమిపాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం కుర్చీ కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కీలక నాయకుడు డీకే శివకుమార్ మధ్యన పోటీ నెలకొంది. గత ఏడాది మేలో ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ సిద్ధు-డీకే చెరో రెండున్నరేళ్లు సీఎంలుగా వ్యవహరించేందుకు ఒప్పందం చేశారు.

సిద్ధుకు తలనొప్పి

అహింద సిద్ధాతంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసిన సిద్ధరామయ్యకు తీవ్ర పోటీ అనంతరం రెండోసారి సీఎం పదవి దక్కంది. ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర పదవీ కాలం పూర్తయింది. మరో ఏడాది కాలం ఉంది. అయితే, ఆయనకు పరిస్థితులు కలిసివచ్చేలా లేవు. మైసూర్ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (ముడా) స్కాంలో సిద్ధరామయ్యకు తాజాగా కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కుంభకోణంలో తనపై విచారణకు అనుమతిస్తూ గవర్నర్‌ ఇచ్చిన ఆదేశాలను సీఎం సిద్ధూ హైకోర్టులో సవాలు చేశారు. అయితే, ఆయన పిటిష న్‌ను హైకోర్టు కొట్టివేసింది. గవర్నర్ థావర్‌చంద్‌ గహ్లోత్, ముఖ్యమంత్రి, పిటిషనర్ల తరఫు వాదనలు విన్న కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.

తదుపరి ఏమిటో?

రాజకీయ వర్గాలు సిద్ధుకు ఇది భారీ షాక్ అని చెబుతున్నాయి. వాస్తవానికి పైకి చూస్తే ఈ కేసులో సిద్ధరామయ్య భార్యకు అనుచిత ప్రయోజనం కలిగింది అనేది అభియోగం. సిద్దు వాదన మాత్రం వేరేగా ఉంది. ‘ముడా’ స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబసభ్యులు లబ్ధి పొందారని.. అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని కర్ణాటక సామాజిక కార్యకర్త టీజే అబ్రహం గవర్నర్‌ కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయి కృష్ణ, ప్రదీప్‌ కుమార్‌ కూడా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆగస్టు 16న సీఎంను విచారించాలంటూ గవర్నర్‌ ఆదేశించారు. వీటిని రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా.. దానిని గవర్నర్ తోసిపుచ్చారు. దాంతో సీఎం సిద్ధు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పడు హైకోర్టులో ఎదురుదెబ్బ తర్వాత ఏం చేస్తారో చూచాలి.

అండగా కాంగ్రెస్ అధిష్ఠానం

సిద్ధుకు కాంగ్రెస్ అధిష్ఠానం గతంలోనే మద్దతు ప్రకటించింది. ఆయనకు ఇండియా కూటమి కూడా మద్దతుగా ఉంది. పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం ఉందా? అంటే లేదని చెప్పొచ్చు. సిద్ధు వంటి నాయకుడిని కాపాడుకోవడం కాంగ్రెస్ కు చాలా అవసరం. జాతీయ స్థాయిలోనూ ఓబీసీల్లోకి చొచ్చుకెళ్లాలంటే సిద్ధును కొనసాగించడమే ఆ పార్టీ మేలు. పైగా కర్ణాటకలో ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. అందుకే జేడీఎ వంటి పార్టీతో లోక్ సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నాయకుడిని కాపాడుకునేందుకు, అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ పోరాటం సాగించవచ్చు.