Begin typing your search above and press return to search.

క‌విత యూట‌ర్న్‌.. సుప్రీంకోర్టులో పిటిష‌న్ వెన‌క్కి!

మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య‌, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ.. క‌విత ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే

By:  Tupaki Desk   |   19 March 2024 7:45 AM GMT
క‌విత యూట‌ర్న్‌.. సుప్రీంకోర్టులో పిటిష‌న్ వెన‌క్కి!
X

మాజీ సీఎం కేసీఆర్ త‌న‌య‌, బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ.. క‌విత ప్ర‌స్తుతం ఈడీ క‌స్ట‌డీలో ఉన్న విష‌యం తెలిసిందే. ఢిల్లీ మ‌ద్యం కుంభ‌కోణంలో రూ.100 కోట్ల వ్య‌వ‌హారానికి సంబంధించి.. అరెస్టు చేసిన అధికారులు.. ఢిల్లీ కోర్టు అనుమ‌తితో ప్ర‌స్తుతం విచార‌ణ చేస్తున్నారు. అయితే.. అస‌లు త‌న అరెస్టే అక్ర‌మ‌మని.. సుప్రీకోర్టుకు అరెస్టు చేయ‌బోమ‌ని చెప్పిన ఈడీ అధికారులు ఇప్పుడు త‌న‌ను అరెస్టు చేయ‌డం ఏంట‌ని క‌విత వాద‌న‌. ఈ క్ర‌మంలోనే ఈడీ వ్య‌వ‌హార శైలిని ప్ర‌శ్నిస్తూ సుప్రీకోర్టులో సోమ‌వారం పిటిష‌న్ వేశారు.

ఈ పిటిష‌న్‌ను సుప్రీకోర్టు కూడా విచార‌ణ‌కు తీసుకుంది. మంగ‌ళ‌వారం అంటే ఈరోజు దీనిపై విచార‌ణ సాగాల్సి ఉంది. కానీ, అనూహ్యంగా ఈ ఉద‌యం కోర్టు కార్య‌క‌లాపాలు ప్రారంభం కాగానే.. క‌విత త‌ర‌ఫున లాయ‌ర్‌.. స‌ద‌రు పిటిష‌న్ను వెన‌క్కి తీసుకున్నారు. కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి తన వాదన లను వినిపిస్తూ... రిట్ పిటిషన్ పై విచారణ అవసరం లేనందున పిటిషన్ ను వెనక్కి తీసుకుంటున్నా మని తెలిపారు. తాము చట్ట ప్రకారం ఉపశమనం పొందేందుకు తదుపరి చర్యలకు వెళ్తామని న్యాయవాది తెలిపారు.

ఈ అభ్య‌ర్థ‌న‌తో పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తులు జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం అంగీకరించింది. కాగా, ఈడీ జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ.. గత ఏడాది మార్చి 14న సుప్రీంకోర్టులో కవిత ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే.. మరోవైపు, కవితను ఈడీ అరెస్ట్ చేయడం అక్రమమంటూ దాఖలైన మరో పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమయింది. ఇది ఆమె బంధువులు దాఖ‌లు చేశారు. అయితే. అనూహ్యంగా క‌విత తాను మొద‌టి నుంచి చెబుతూ వ‌చ్చిన‌.. ఈడీ అక్ర‌మ అరెస్టును దీంతో అంగీక‌రించిన‌ట్టు అయింద‌నే వాద‌న అధికార వ‌ర్గాల నుంచి వినిపిస్తోంది.