తెలంగాణ హైకోర్టు సంచలనం..కొత్తగూడెం ఎమ్మెల్యే ఎన్నిక రద్దు
కొత్తగూడెంలో ఓటమి తర్వాత ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయన వనమాపై పిటిషన్ దాఖలు చేశారు
By: Tupaki Desk | 25 July 2023 7:48 AM GMTఅసలే వ్యక్తిగతంగా ఇబ్బందుల్లో ఉన్న కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్టు భారీ షాకిచ్చింది. 78 ఏళ్ల వనమా ఎన్నికను చెల్లదని ప్రకటించింది. 2018 ఎన్నికల్లో ఆయన తప్పుడు సమాచారం ఇచ్చారని అందుకనే ఎన్నికను కొట్టివేస్తున్నట్లు సంచలన తీర్పు ఇచ్చింది. వనమా ఎన్నికను రద్దు చేయడమే కాక.. ఆయన తర్వాత రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగానూ ప్రకటించింది.
కాంగ్రెస్ నుంచి గెలిచి.. బీఆర్ఎస్ లోకి వనమా వెంకటేశ్వరరావు ఉమ్మడి ఖమ్మంలోనే సీనియర్ ఎమ్మెల్యే. ప్రస్తుత శాసన సభలో ఆయనే అత్యంత పెద్ద వయసువారు. తొలి నుంచి కాంగ్రెస్ వాది. 2007-09 మధ్య మంత్రిగానూ పనిచేశారు. 1989, 1999, 2004, 2018లో మొత్తం నాలుగు సార్లు గెలిచారు. అన్నిసార్లూ కాంగ్రెస తరఫునే నెగ్గారు. కానీ, 2018లో నాలుగో సారి గెలిచాక బీఆర్ఎస్ లోకి వెళ్లారు.
ఓడిన అభ్యర్థే పిటిషన్ దారు 2014లో కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ తరఫున నెగ్గిన జలగం వెంకట్రావు 2018లో వనమా చేతిలో ఓడిపోయారు. అది కూడా కేవలం 4 వేల పైచిలుకు ఓట్ల తేడాతోనే. వెంకట్రావు గతంలో సత్తుపల్లి ఎమ్మెల్యేగానూ పనిచేశారు.
అయితే, కొత్తగూడెంలో ఓటమి తర్వాత ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయన వనమాపై పిటిషన్ దాఖలు చేశారు. దీపై మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది. వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను కొట్టివేయడమే కాక.. ఆయనకు రూ.5 లక్షల జరిమానా విధించింది.
బీఆర్ఎస్ బలం తగ్గలేదు.. పెరగలేదు ప్రస్తుతం బీఆర్ఎస్ కు శాసనసభలో 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అయితే, వనమా ఎన్నికను కొట్టివేయడంతో జలగం ఆయన స్థానంలో ఎమ్మెల్యే అవుతున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమా బీఆర్ఎస్ లోకి వెళ్లారు. అంటే ఇప్పుడు సభలో బీఆర్ఎస్ బలం తగ్గలేదు. పెరగలేదు. కాకపోతే ఎమ్మెల్యేనే మారారు. ఇది చిత్రమైనదే.
వనమా బీఆర్ఎస్ లోకి వెళ్లినా ఆయనపై వేసిన కేసును కొనసాగించిన వెంకట్రావు చివరకు ఫలితం సాధించారు. ఇక వనమా వయోభారం రీత్యా ఆరోగ్య ఇబ్బందులను ఎదుర్కొని కోలుకున్నారు. అయితే, ఆయన కుమారుడిపై ఏడాది కిందట తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. కేసులు కూడా నమోదయ్యాయి.