ఫార్ములా ఈ రేసు కేసులో కీలక పరిణామం.. సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.
By: Tupaki Desk | 7 Jan 2025 10:00 AM GMTతెలంగాణ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్న ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక పాత్రధారిగా భారతీయ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో కేటీఆర్‌పై కేసులో నమోదయ్యాయి. పద్యంలోనే కేటీఆర్ తనపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు కొట్టు వేయాలంటూ హైకోర్టులో దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఇరుపక్షాల వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ తీర్పునిచ్చింది.
అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఉపసంహరించుకున్నది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పుపై కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీనిపై నందినగర్‌లోని తన నివాసంలో లీగల్ టీంతో చర్చిస్తున్నారు కేటీఆర్. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రులతో కేటీఆర్ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది.
కేటీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని తెలంగాణ ప్రభుత్వం కోరుకుంటుంది. అందుకు అనుగుణంగానే పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. కేటీఆర్ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. దీనికి సంబంధించి పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉందని న్యాయవాదులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేటీఆర్ ఇంట్లో తనిఖీలు నిర్వహించేందుకు ఏసీబీ అనుమతి పొందింది. సెర్చ్ వారెంట్‌కు కోర్టు అనుమతి ఇవ్వడంతో ఏ క్షణంలో అయినా కేటీఆర్ ఇంటికి ఏసీబీ అధికారులు వెళ్లే అవకాశం ఉంది. కేటీఆర్‌తోపాటు అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డి నివాసాల్లోనూ సోదాలకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రీన్ కో కంపెనీ ద్వారా జరిగిన ఒప్పందం, లావాదేవీలపై దర్యాప్తు నిర్వహించనున్నారు.
హెచ్ఎండీఏ ద్వారా జరిగిన లావాదేవీలు, ఒప్పంద పత్రాలను సేకరించేందుకు ఏసీబీ సిద్ధమవుతోంది. ఒకవైపు హైకోర్టు క్వాష్ పిటిషన్ ను తోసి పుచ్చడం, మరోవైపు ఏసీబీ తనిఖీలకు సిద్ధమవుతుండడంతో కేటీఆర్ ఇంటికి పెద్ద ఎత్తున ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇప్పటికే నందినగర్ లోని కీలక నాయకులతో సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై కేటీఆర్ చర్చలు జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో ఏం తేలుతుందో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.