Begin typing your search above and press return to search.

సినిమా రివ్యూలపై బ్యాన్ కు నో చెప్పిన మద్రాస్ హైకోర్టు

ఇప్పుడు నేరుగా విషయంలోకి వెళదాం. సినిమా రివ్యూలపై నిషేధాన్ని విధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు తమిళ సినిమా నిర్మాతల సంఘం.

By:  Tupaki Desk   |   4 Dec 2024 1:30 AM GMT
సినిమా రివ్యూలపై బ్యాన్ కు నో చెప్పిన మద్రాస్ హైకోర్టు
X

విషయంలోకి వెళ్లటానికి ముందు ఒక మాట మాట్లాడుకోవాలి. ఒక బాగున్న సినిమాను బాగోలేదన్న రివ్యూ రాసినంత మాత్రానా ప్రేక్షకులు పట్టించుకుంటారా? అదే టైంలో చెత్తగా ఉన్న మూవీని వావ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ రివ్యూలు రాసేస్తే.. ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతారా? కాకుంటే.. సినిమా రివ్యూల ఆధారంగా సినిమాకు వెళ్లాలా? వద్దా? అన్న విషయంలో కొన్నిసార్లు నిర్ణయించుకునే వీలుంది. అది కూడా ఒకట్రెండు రివ్యూలు కాదు.. దాదాపు ఐదారు రివ్యూలు చదవటం ఈ రోజుల్లో కామన్ గా మారింది.

ఇక్కడే మరో విషయాన్ని ప్రస్తావించాలి. ఏ వస్తుసేవలు అయినా.. సంత్రప్తి కరంగా లేని పక్షంలో.. వాటి తయారీ దారులను కానీ.. వాటిని అందించిన సంస్థను కానీ ప్రశ్నించే వీలుంది. కానీ.. ఒక సినిమా బాగోకుంటే.. బాగోలేదని తిట్టుకొని బయటకు రావటం తప్పించి ఇంకేమీ చేయలేని పరిస్థితి. డబ్బులు చెల్లించి.. ఆనందాన్ని.. సంతోషాన్ని ఆవిరి చేసుకునే వేదికలు ఏమైనా ఉన్నాయంటే అది సినిమానే అవుతుంది. మరి.. అలాంటి పరిస్థితుల్లో డబ్బులు ఖర్చు చేసిన వాడి సంగతేంటి? అన్నది ప్రశ్న.

ఇప్పుడు నేరుగా విషయంలోకి వెళదాం. సినిమా రివ్యూలపై నిషేధాన్ని విధించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు తమిళ సినిమా నిర్మాతల సంఘం. వారి తరఫున మద్రాస్ హైకోర్టుకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీని ప్రకారం.. సోషల్ మీడియాలో రివ్యూలు ప్రసారం చేసే అంశంపై నిబంధనలు తీసుకురావాలని.. కేంద్ర.. రాష్ట్ర ప్భుత్వాలకు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ ఒక పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్.. సౌందర్ స్పందిస్తూ విమర్శ అన్నది భావ ప్రకటనా స్వేచ్ఛ అని.. వాటిపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయటం కుదరదని తేల్చారు. అయితే.. పిటిషన్ పై నాలుగు వారాల్లో జవాబులు ఇవ్వాలంటూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూట్యూబ్ కు ఉత్తర్వులు జారీ చేసి వివరణ ఇవ్వాలని కోరారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే.. ఇటీవల భారీ బడ్జెట్ లో నిర్మితమైన కంగువా చిత్రంపై సోషల్ మీడియాలో వచ్చిన రివ్యూలు పెను దుమారాన్ని రేపాయి. సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూలు రాయకుండా ఉండేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు తమిళ నిర్మాతల టీం. దీనికి తాజాగా మద్రాస్ హైకోర్టు నో చెప్పింది.