Begin typing your search above and press return to search.

నాంపల్లి కోర్టుకు నాగార్జున ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే?

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   8 Oct 2024 11:14 AM GMT
నాంపల్లి కోర్టుకు నాగార్జున ఏం స్టేట్మెంట్ ఇచ్చారంటే?
X

తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల‌పై టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశంపై నాగార్జున ఈరోజు మంగళవారం తన స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కొండా సురేఖ బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి తన కుటుంబంపై అనుచిత వాఖ్యలు చేసిందని, దీని వలన తమ కుటుంబ పరువు మర్యాదలకు తీవ్ర భంగం వాటిల్లిందని కోర్టుకు తెలిపారు. ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలనికి న్యాయస్థానాన్ని కోరారు.

రాజకీయ విమర్శల్లో భాగంగా ఇటీవల మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ నాగార్జున, నాగచైతన్య, సమంతల పేర్లను ప్రస్తావిస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. మంత్రి కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న నాగార్జున.. నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు. దశాబ్దాలుగా పేరు ప్రఖ్యాతులను కాపాడుకుంటూ వస్తున్న మా కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా కొండా సురేఖ నిరాధార వ్యాఖ్యలు చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఆమె వ్యాఖ్యల వల్ల తమ కుటుంబంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని, నిజానిజాలు తెలుసుకోకుండా పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేసిన ఆమెపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. నాగార్జున వాంగ్మూలం నమోదు చెయ్యాలని తెలిపింది.

ఈ నేపథ్యంలోనే నాగార్జున మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటుగా సతీమణి అమల, కుమారుడు నాగచైతన్య, సోదరి నాగ సుశీల, మేన కోడలు సుప్రియ వచ్చారు. విచారణలో భాగంగా దేని కోసం ఈ పిటిషన్ ఫైల్ చేసారని నాగార్జునను న్యాయస్థానం ప్రశ్నించింది. కొండా సురేఖ తన కుటుంబంపై కుమారుడు నాగచైతన్య విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేసిందని, ఆమె వ్యాఖ్యల వల్ల తమ కుటుంబ పరువు మర్యాదలకు భంగం కలిగిందని ఆయన వాంగ్మూలం ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారని.. అన్ని మీడియా ఛానళ్లు, వార్తా పత్రికల్లో ఆ వ్యాఖ్యలు వచ్చాయని తెలిపారు.

సినీ రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగంతో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నాం. నా కొడుకు విడాకులపై మంత్రి అనుచితంగా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. అసత్యమైన నిరాధార ఆరోపణలు చేసిన కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున కోర్టుకు విన్నవించారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను న్యాయస్థానం రికార్డు చేసింది. సాక్షులుగా నాగార్జున కుటుంబ సభ్యుల వాగ్మూలం కూడా రికార్డు చేసింది.