సుప్రీంకోర్టు తదుపరి సీజేని సిఫార్సు చేసిన సీజేఐ... ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా?
ఈ సమయంలో... తదుపరి చీఫ్ జస్టిస్ గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 17 Oct 2024 5:04 AM GMTదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ)గా ఉన్న డీవై చంద్రచూడ్ నవంబర్ 11న రిటైర్ కాబోతున్నారు! దీంతో... తదుపరి చీఫ్ జస్టిస్ ఎవరనే చర్చ తెరపైకి వచ్చింది. ఈ సమయంలో... తదుపరి చీఫ్ జస్టిస్ గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
అవును... తదుపరి చీఫ్ జస్టిస్ గా సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు తన తర్వాత సీజేగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును ప్రస్తుతం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రతిపాదించారు. దీనికి కేంద్రం ఆమోదం తెలిపితే సుప్రీంకోర్టు 51వ సీజేగా జస్టిస్ ఖన్నా నియమితులు కానున్నారు.
సంప్రదాయం ప్రకారం సీజేఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు. ఈ ప్రతిపాదనను లేఖ రూపంలో న్యాయశాఖకు పంపుతారు. ఈ లేఖను కేంద్ర న్యాయశాఖ.. ప్రధానికి పంపుతుంది. ఆయన ఆమోదం తర్వాత అది రాష్ట్రపతికి చేరుకుంటుంది.
ఫైనల్ గా రాష్ట్రపతి అనుమతితో తదుపరి ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపడతారు. ఈ క్రమంలో... జస్టిస్ డీవై చంద్రచూడ్ తర్వాత జస్టిస్ సంజీవ్ ఖన్నా సీనియర్ గా ఉన్నారు. దీంతో... అన్నీ అనుకూలంగా జరిగితే నవంబర్ 12న జస్టిస్ ఖన్నా సీజేఐ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మే 13న ఆయన పదవీ విరమణ చేయనున్నారు!
ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా..?:
మే 14, 1960లో జన్మించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా... 1977లో న్యూ ఢిల్లీలోని మోడరన్ స్కూల్ నుంచి పాఠశాల విద్యను పూర్తి చేశారు. 1980లో సెయింట్ స్టీఫెన్స్ నుంచి పట్టభద్రుడయ్యారు. అనంతరం ఢిల్లీ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం 1983లో ఢిల్లీ బార్ కౌన్సిలో లాయర్ గా నమోదు చేసుకున్నారు.
ఈ క్రమంలో.. ఢిల్లీ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. తర్వాత ఢిల్లీ హైకోర్టు, ట్రిబ్యునళ్లకు మారారు. ఈయన రాజ్యాంగ చట్టం, ప్రత్యక్ష పన్ను విధానం, కంపెనీ లా, భూ చట్టాలు, కమరిషియల్ లా, ఎన్విరాన్మెంటల్ లా, పర్యావరణం - కాలుష్య చట్టాలు, వైద్యపరమైన నిర్లక్ష్యం వంటి రంగాల్లో ప్రాక్టీస్ చేశారు.
ఈ క్రమంలో 2004లో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సిల్ (సివిల్) గా నియమించబడ్డారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ఢిల్లీ హైకోర్టులో అనేక క్రిమినల్ కేసులను వాదించారు. ఈ క్రమంలో 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా ఎదిగిన జస్టిస్ ఖన్నా... 20 ఫిబ్రవరి 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఇలా సుమారు 14 సంవత్సరాల పాటు ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ సమయంలోనే ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ ఛైర్మన్ గానూ నియమితులయ్యారు. ఈ క్రమంలోనే 2019 జనవరి 18న ఆయన భారతదేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
అనంతరం 2023 జూన్ 17 నుంచి 2023 డిసెంబర్ 25 వరకూ సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీలో ఛైర్మన్ గా పనిచేశారు. ఆయన ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా, నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ - భోపాల్ పాలక న్యాయవాదిగా ఉన్నారు.
ఈ ఏడాది ఏప్రిల్ లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లు (ఈవీఎం) లలో వీవీప్యాట్ తో క్రాస్ వెరిఫికేషన్ చేయాలంటూ వేసిన పిటిషన్ ను కొట్టివేస్తూ జస్టిస్ సంజీవ్ ఖన్నా తీర్పు ఇచ్చారు. ఇదే సమయంలో.. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ రాజ్యాంగ చెల్లుబాటును కొట్టివేసిన సుప్రీంకోర్టు బెంచ్ లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కూడా ఉన్నారు!
ఈ నేపథ్యలోనే నవంబర్ 12న జస్టిస్ ఖన్నా సీజేఐ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఆరు నెలల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే 13న ఆయన పదవీ విరమణ చేయనున్నారు!