బాబా రాందేవ్ ను వదలని సుప్రీంకోర్టు!
పతంజలి ప్రకటనలను నమ్మి ప్రజలు వాటిని వినియోగిస్తే ప్రజలకు భారీ నష్టం తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది.
By: Tupaki Desk | 23 April 2024 3:03 PM GMTతమ ఆయుర్వేదిక్ ఉత్పత్తులు బీపీ, షుగర్ వ్యాధులను నిర్మూలిస్తాయని బాబా రాందేవ్ కు చెందిన పతంజలి ఆయుర్వేదిక్ ఉత్పత్తుల సంస్థ దేశవ్యాప్తంగా పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇప్పుడవే ప్రకటనలు పతంజలి మెడకు చుట్టుకున్నాయి. బీపీ, సుగర్, కరోనాలాంటి వాటిని తమ ఆయుర్వేదిక ఉత్పత్తులు పారదోలతాయని పతంజలి ఇచ్చిన ప్రకటనలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొంది. పతంజలి ప్రకటనలను నమ్మి ప్రజలు వాటిని వినియోగిస్తే ప్రజలకు భారీ నష్టం తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు క్షమాపణ చెప్పింది. అయినా సుప్రీంకోర్టు శాంతించలేదు. సారీ అంటే సరిపోదని క్షమాపణలు చెప్పడం అలా కాదని తలంటింది. కోర్టుకు హాజరు కాకుండా న్యాయవాది ద్వారా సారీ చెప్పిస్తే సరిపోదని వ్యాఖ్యానించింది. దీంతో స్వయంగా బాబా రాందేవ్, పతంజలి నిర్వాహకుడు బాలకృష్ణ కోర్టుకు హాజరై క్షమాపణలు తెలిపారు.
అయినా సరే పతంజలి వ్యవహారంలో సుప్రీంకోర్టు కటువుగానే ఉంది. పతంజలి ఉత్పత్తులకు ప్రకటనలకు సంబంధించిన వ్యవహారంలో ఆ సంస్థ క్షమాపణలు చెబుతూ ఫుల్ పేజీ ప్రకటనలు ఇచ్చిందా అని సుప్రీంకోర్టు ఆ సంస్థ తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది.
ఈ సందర్భంగా పతంజలి న్యాయవాదులు క్షమాపణల కోసం ఆ సంస్థ రూ. లక్షలు వెచ్చిందని తెలిపారు. సుమారు రూ.10 లక్షల ఖర్చుతో 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చిందని పతంజలి తరపు ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ కోర్టుకు నివేదించారు. ఇందులో ప్రముఖ జాతీయ పత్రికలు కూడా ఉన్నాయన్నారు. అయితే ఎంత మొత్తం ఖర్చు చేశారో తమకు సంబంధం లేని అంశమని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే ఈ క్షమాపణలు గతంలో పతంజలి తమ ఆయుర్వేద ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఫుల్ పేజీ యాడ్స్ సైజులోనే ఉన్నాయా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే ఫాంట్ సైజు కూడా గతంలో ఉత్పత్తుల ప్రచారానికి ఏ సైజులో ఇచ్చిందో ఇప్పుడు క్షమాపణలు కూడా అదే ఫాంట్ సైజులో ఉన్నాయా అని నిలదీసింది,
ఈ నేపథ్యంలో పత్రికల్లో క్షమాపణలను పెద్ద సైజులో ప్రకటనలుగా ఇస్తామని బాబా రాం దేవ్ చెప్పడంతో ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మరో వారం వాయిదా వేసింది.