బందరు బియ్యం కేసు.. పేర్నికి బిగ్ రిలీఫ్
మచిలీపట్నంలోని జేఎస్ వేర్ హౌస్ నుంచి బియ్యం అక్రమంగా తరలించిన కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.
By: Tupaki Desk | 7 March 2025 12:05 PM ISTమచిలీపట్నంలోని జేఎస్ వేర్ హౌస్ నుంచి బియ్యం అక్రమంగా తరలించిన కేసులో మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో ఏ6గా ఉన్న పేర్నికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇంతకాలం అరెస్టు భయంతో గడిపిన మాజీ మంత్రి ఊపిరిపీల్చుకున్నారు. బియ్యం అక్రమ తరలింపు కేసులో మాజీ మంత్రి పేర్నితోపాటు ఆయన భార్య పేర్ని జయసుధ కూడా నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే.
కేసులు, అరెస్టుల నుంచి వైసీపీ నేతలకు కాస్త ఊరట లభిస్తోంది. నిన్న సినీ రంగానికి చెందిన పోసాని క్రిష్ణమురళి, దర్శకుడు ఆర్జీవీకి కేసుల విచారణ నుంచి ఉపశమనం ఇచ్చిన హైకోర్టు ఈ రోజు మాజీ మంత్రి పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మచిలీపట్నంలోని పేర్ని సతీమణికి చెందిన బియ్యం గోడౌన్ నుంచి బియ్యం అక్రమంగా తరలించారని పేర్నితోపాటు ఆయన భార్యపైనా ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు ఇదివరకే ముందస్తు బెయిల్ మంజూరుకాగా, ఈ రోజు పేర్ని నానికి ముందస్తు బెయిల్ లభించింది. దీంతో పేర్నికి అరెస్టు నుంచి రక్షణ కల్పించినట్లైంది.
రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవమరించింది. ఈ కేసులో మాజీ మంత్రిని పేర్నిని అరెస్టు చేయించాలని ప్రస్తుత మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా ప్రయత్నించారని వైసీపీ నేతలు విమర్శించారు. తమ గోడౌన్ లో బియ్యం మాయమైనందుకు బాధ్యతగా పేర్ని కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి రూ.1.70 కోట్లు చెల్లించారు. అయినప్పటికీ ప్రజాధనం దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో ప్రభుత్వం క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఏ1 పేర్ని జయసుధ, ఏ6 పేర్ని నాని తప్ప మిగిలిన నిందితులు అంతా అరెస్టు అయ్యారు. పేర్ని దంపతులకు మాత్రం కోర్టు నుంచి రక్షణ దక్కడంతో అరెస్టు నుంచి తప్పించుకున్నారు.
ఇక ఈ కేసుపై మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని నాని మధ్య రాజకీయ ఎత్తుగడలు హీట్ పుట్టించాయి. తన రాజకీయ ప్రత్యర్థిని ఎలాగైనా అరెస్టు చేయించాలని మంత్రి కొల్లు రవీంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని పేర్ని నాని కూడా బహిరంగంగా ప్రకటించారు. తన అరెస్టుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని, కానీ తనవైపు న్యాయం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. మరోవైపు పేర్ని భార్య జయసుధ అరెస్టు విషయంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించలేదని పేర్ని చెప్పారు. ఆయన అలా ప్రకటించిన తర్వాతే పేర్ని జయసుధకు జిల్లా కోర్టులో బెయిల్ రావడం గమనార్హం.