పిన్నెల్లికి ఆ రెండు కేసుల్లోనూ బెయిల్.. కానీ షరతులు!
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన రెండు హత్యా యత్నం కేసుల్లో అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ.. తాజాగా తీర్పు వెలువరించింది.
By: Tupaki Desk | 28 May 2024 7:05 AM GMTవైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన రెండు హత్యా యత్నం కేసుల్లో అరెస్టు నుంచి తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ.. తాజాగా తీర్పు వెలువరించింది. వచ్చే నెల 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని.. ఆయనను నిర్బంధించడం.. ప్రశ్నించ డం కూడా చేయరాదని పోలీసులకు తేల్చి చెప్పింది. అదేవిధంగా కౌంటింగ్‌లో పాల్గొనేందుకు అవకాశం కల్పించింది.
అయితే.. పిన్నెల్లికి కొన్ని షరతులు విధించింది. ఎట్టి పరిస్థితిలోనూ.. ఆయన మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టరాదని హైకోర్టు తేల్చి చెప్పింది. అదేవిధంగాసాక్షులను ప్రభావితం చేయరాదని.. కేసులకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించరాదని కూడా పేర్కొంది. అధికారులు.. ఇతరులతోనూ ఫోన్లలో సంభాషించరాదని.. కేవలం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వరకు మాత్రమే పరిమితం కావాలని పేర్కొంది. గతంలో ఈవీఎం , వీవీ ప్యాట్‌ల ధ్వంసం కేసులో ఎలాంటి షరతులు వర్తిస్తాయో.. ప్రస్తుత హత్యాయత్నం కేసుల్లోనూ అవే షరతులు వర్తిస్తాయని పేర్కొంది.
ఇవీ.. ఆ రెండు కేసులు..
1) పోలింగ్ జరుగుతున్న సమయంలో పాల్వాయి గేట్ పోలింగ్ బూత్‌లోకి దూసుకువెళ్లిన పిన్నెల్లి.. అక్కడి ఈవీఎం, వీవీప్యాట్‌ను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. దీనిని ప్రశ్నించిన టీడీపీ బూత్ ఏజెంట్ నంబూరి శేషగిరిపై దాడి చేసి ... తీవ్రంగా గాయపరిచినట్టు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు 307 కింద కేసు నమోదు చేశారు.
2) అదేవిధంగా స్థానిక సీఐ నారాయణ స్వామిపై పిన్నెల్లి అనుచరులు దాడి చేసి గాయపరిచారు. ఈ కేసులోనూ పిన్నెల్లిపై హత్యాయత్నం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లోనూ ఆయనకు తాజాగా హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఇప్పటికే ఈవీఎం, వీవీ ప్యాట్ ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. పైరెండు కేసులు నమోదు కావడంతో ఆయన ఇంకా అజ్ఞాతం వీడలేదు.