ఉచితాలు తప్పు.. హామీలు ఒప్పు: మేనిఫెస్టోలపై సుప్రీంకోర్టు
రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇస్తున్న మేనిఫెస్టోల గురించి.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న విషయం తెలిసిందే
By: Tupaki Desk | 28 May 2024 4:55 AM GMTరాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో ఇస్తున్న మేనిఫెస్టోల గురించి.. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. మరీ ముఖ్యంగా ఉచిత హామీలు ఇస్తూ.. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునేందుకు దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ పార్టీలూ ప్రయత్నిస్తున్నారు. వీటిలో దేనీకి మినహాయింపు లేదు. అయితే.. ఈ గాటలో ఇప్పుడు కీలక జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా చేరిపోయింది. తాము కేంద్రంలో అధికారంలోకి వస్తే.. ఏటా పేదలకు రూ.లక్ష ఉచితంగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని తాజా సార్వత్రిక ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మేనిఫెస్టోలనూ చేర్చింది.
ఇక, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు. ఏపీలో కూటమి పార్టీలు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తామని తాజా ఎన్నికల్లో హామీ ఇచ్చాయి. అయితే.. ఉచిత హామీల విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఫైరైంది. ఉచిత హామీలు ఎలా ఇస్తారని నిలదీసింది. అన్ని పార్టీల అభిప్రాయాలు చెప్పాలని గత ఏడాది ఆదేశించింది. దీనిపై తీర్పు ఇంకా ఇవ్వాల్సి ఉంది. అంటే ఒక రకంగా ఉచితాలు తప్పనే సుప్రీంకోర్టు అభిప్రాయపడుతోంది. అయితే.. ఇంతలోనే మేనిఫెస్టోల వ్యవహారం తెరమీదికి వచ్చింది.
తాజాగా కర్ణాటకకు చెందిన చామరాజనగర్ నియోజకవర్గంలో ఓడిపోయిన అభ్యర్థి.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టోను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఇది అవినీతి కిందకే వస్తుందని.. మేనిఫెస్టోలను ప్రకటించకుండా చూడాలని.. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని కూడా శశాంక జె శ్రీధర సుప్రీం కోర్టును కోరారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేసిన కోర్టు.. తాజాగా తీర్పు వెలువరించింది. మేనిఫెస్టోలను తప్పుపట్టేందుకు ఏమీలేదని తెలిపింది. అంతేకాదు.. ఇవి అవినీతి కిందకి రాబోవని చెప్పడం గమనార్హం.
``అవినీతి అంటే.. నేరుగా ఆశించి తీసుకోవడం.మేనిఫెస్టోల్లో పేర్కొనేవి హామీలు మాత్రమే. అవి నిర్దేశిత పంథాలో చేయాలని ఏమీ లేదు. అవకాశం వీలును బట్టి ఇచ్చే హామీలకు.. అవినీతికి చాలా తేడా ఉంది. మేనిఫెస్టోలు ఇవ్వడం తప్పుకాదు`` అని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో శశాంక జె శ్రీధర దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. అయితే.. ఉచితాలు లేని మేనిఫె స్టోలు దాదాపు లేనేలేవు. అయితే.. ఉచితాలు తప్పుపడుతున్న కోర్టు.. మేనిఫెస్టోలను అవినీతి కాదని తేల్చి చెప్పడం విశేషం.