Begin typing your search above and press return to search.

ప్రణయ్ హత్య కేసులో ఏ2కు ఉరి.. కోర్టు సంచలన తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో ఏడేళ్ల కిందట తీవ్ర సంచలనం రేపింది ప్రణయ్ హత్య కేసు.

By:  Tupaki Desk   |   10 March 2025 2:41 PM IST
ప్రణయ్ హత్య కేసులో ఏ2కు ఉరి.. కోర్టు సంచలన తీర్పు
X

తెలుగు రాష్ట్రాల్లో ఏడేళ్ల కిందట తీవ్ర సంచలనం రేపింది ప్రణయ్ హత్య కేసు. అప్పటివరకు ఇలాంటి ఉదంతాలు జరిగినట్లు ఎక్కడా వెలుగులోకి రాలేదు. వచ్చినా అవేమంత సంచలనం కాలేదు. తన కుమార్తెను ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిని భారీమొత్తంలో సుపారీ ఇచ్చి మరీ హత్య చేయించిన ఉదంతం పెను దుమారం రేపింది.

ప్రణయ్ హత్య కేసులో తాజాగా నల్లగొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు సంచలనం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో రెండో నిందితుడికి ఉరి శిక్ష విధించింది. మొదటి నిందుతుడు చనిపోగా.. మిగిలినవారికి జీవితఖైదు విధిస్తూ తీర్పు వెల్లడించింది.

ఇదీ అసలు కేసు..

ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన మారుతీరావు పెద్ద వ్యాపారి. సంపన్నుడైన ఆయనకు ఏకైక కుమార్తె అమృత. అగ్ర వర్ణానికి చెందిన ఈ యువతి దళిత యువకుడైన ప్రణయ్ ను ప్రేమించి పెళ్లాడింది. ఈ వివాహం మారుతీరావుకు అసలు ఇష్టం లేదు. దీంతో 2018 సెప్టెంబరు 14న సుపారీ గ్యాంగ్‌తో ప్రణయ్‌ ను హత్య చేయించాడు.

భార్య, తల్లితో కలిసి ఆస్పత్రికి వెళ్లివస్తున్న ప్రణయ్ ను సుపారీ గ్యాంగ్ సభ్యుడు సుభాష్ కుమార్ శర్మ కత్తితో దారుణంగా నరికి చంపాడు. అక్కడికక్కడే ప్రణయ్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసును అప్పట్లో నల్లగొండ ఎస్పీగా ఉన్న ఏవీ రంగనాథ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎనిమిది మందిని నిందితులుగా పేర్కొంటూ 2019లో ఛార్జిషీటు దాఖలు చేసింది.

ఐదేళ్లకు పైగా కోర్టులో విచారణ సాగింది. కొన్నాళ్ల కిందట వాదనలు ముగిశాయి. సోమవారం నల్లగొండ కోర్టు తీర్పు ఇస్తూ ప్రణయ్ ను కత్తితో నరికి చంపిన ఏ2 సుభాష్‌కుమార్‌శర్మకు ఉరి శిక్ష విధించింది. ఏ3 అస్గర్‌ అలీ, ఏ4 బారీ, ఏ5 కరీం, ఏ6 శ్రవణ్‌కుమార్, ఏ7 శివ, ఏ8 నిజాం. సుభాష్‌ గతంలో బెయిల్‌ కు ప్రయత్నించినా దొరకలేదు. అలీ వేరే కేసులో జైలులో ఉన్నాడు. మిగిలినవారికి బెయిల్‌ వచ్చింది.

శ్రవణ్‌ కుమార్‌ అమృతకు సొంత బాబాయి.

ఇక ఈ కేసులో ఏ1 మారుతీరావు. ఈయన 2020లో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

పెళ్లయిన 9 నెలలకే..

ప్రణయ్‌, అమృత 2018 జనవరిలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబరులో ప్రణయ్ హత్యకు గురయ్యాడు. కాగా, భర్త హత్య సమయానికి కే అమృతకు ఏడు నెలలు. ఆ తర్వాత ఆమెకు కుమారుడు పుట్టాడు.