Begin typing your search above and press return to search.

కోర్టులో 81 కోళ్లకు వేలం వేస్తే రూ.16.65 లక్షలు

అవును.. కోర్టులో కోళ్లను వేలం వేశారు. దానికి కారణం లేకపోలేదు. నిజానికి కోర్టులో కోళ్ల వేలం అనే అంశం కంటే వాటికి పలికిన ధర మీదనే ఇప్పుడు అందరి చూపు పడింది.

By:  Tupaki Desk   |   18 Feb 2025 5:19 AM GMT
కోర్టులో 81 కోళ్లకు వేలం వేస్తే రూ.16.65 లక్షలు
X

అవును.. కోర్టులో కోళ్లను వేలం వేశారు. దానికి కారణం లేకపోలేదు. నిజానికి కోర్టులో కోళ్ల వేలం అనే అంశం కంటే వాటికి పలికిన ధర మీదనే ఇప్పుడు అందరి చూపు పడింది. 81 కోళ్లను హైదరాబాద్ మహానగర శివారులోని రాజేంద్రనగర్ కోర్టులో నిర్వహించిన వేలంలో భారీ ధరకు అమ్ముడయ్యాయి. మొత్తం 81 కోళ్లకు రూ.16.65 లక్షల ఆదాయం రావటం.. ఆ మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయటం ఆసక్తికరంగా మారింది.

ఇంతకూ ఈ కోళ్లు ఏంది? కోర్టులో వేలం ఏంది? అన్న సందేహం వచ్చిందా? ఇటీవల మొయినాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న కోళ్ల పందాల గురించి సమాచారం అందుకున్న పోలీసులు మెరుపుదాడి చేయగా.. అక్కడ 84 కోళ్లు.. భారీ ఎత్తున నగదు.. కార్లు.. పందేం రాయుళ్లు దొరికిపోయారు. కోళ్లను జప్తు చేసి కోర్టు ముందు ఉంచారు. దీంతో.. వాటిని వేలం వేయాలన్న ఆదేశాల నేపథ్యంలో సోమవారం కోర్టు ఆవరణలో ఈ కోళ్ల వేలం వేశారు.

సాధారణంగా ఒక కోడి ఎంత పలుకుతుందో తెలిసిందే. అందుకు భిన్నంగాఈ వేలంలో సరాసరిగా 20వేల రూపాయిలకు పైనే అమ్ముడుపోవటం విశేషం. ఒక్కో కోడిని రూ.20వేలు పెట్టి కొని చికెన్ చేసుకుంటారా? అంటే తప్పులో కాలేసినట్లే. ఇప్పటికే బోలెడంత ప్రాక్టీస్ ఇచ్చి.. బాదంపప్పులు.. పిస్తాపప్పులు.. జీడిపప్పులు తినిపించి పెంచిన కోళ్లు కావటం..కోళ్ల పందాలకు అనువుగా శిక్షణ ఇప్పించిన నేపథ్యంలో ఈ కోళ్లు మంచి ధర పలికినట్లుగా చెబుతున్నారు.

పోలీసుల జప్తుచేసిన 84 కోళ్లలో మూడు చనిపోగా.. మిగిలిన 81 కోళ్లను తాజాగా వేలం వేశారు. తొమ్మిది కోళ్లను ఒక గ్రూపుగా.. మొత్తం తొమ్మిది గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపునకు కనీస ధరగా రూ.14 వేలు నిర్ణయించగా.. సరాసరిగా ఒక్కో కోడి రూ.20వేలకు పైనే ధర పలకటం చూసినోళ్లు ఆశ్చర్యపోయారు. ఇంతకూ కోర్టులో కోళ్లను వేలంలో గెలుచుకున్నోళ్లు ఎవరు? అంటారా? ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉందంటారా?