వర్మని అక్కడే తేల్చుకోమన్న హైకోర్టు
రిలీజ్ కు ముందే రాంగోపాల్ వర్మ 'వ్యూహం' ఏ స్థాయిలో వివాదాలు సృష్టిస్తుందో తెలిసిందే
By: Tupaki Desk | 3 Jan 2024 9:23 AM GMTరిలీజ్ కు ముందే రాంగోపాల్ వర్మ 'వ్యూహం' ఏ స్థాయిలో వివాదాలు సృష్టిస్తుందో తెలిసిందే. కొన్ని నెలలుగా సినిమా కోర్టులు చుట్టూ తిరుగుతూనే ఉంది. రాజకీయ వివాదం నేపథ్యంలో సినిమా రిలీజ్ కావడానికి వీల్లేదంటూ నారా లోకేష్ కేసులు వేయడంతో సినిమాపై కేసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా 'వ్యూహం' నిర్మాత దాసరి కిరణ్ కుమార్ దాఖలు చేసిన పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సినిమా విడుదలపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ నిర్మాత పిటీషన్ దాఖలు చేసారు.
దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. సినిమా విడుదల కాకపోవడంతో కోట్లలో నష్టం వచ్చిందని నిర్మాత తరుపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. విచారణను సింగిల్ బెంచ్ ఈనెల 11కి వాయిదా వేసిందని తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలని పిటీషనర్ కి స్పష్టం చేసింది. ఇప్పటికే వ్యూహం సినిమా విడుదలపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ చిత్రాన్ని ఓటీటీ.. ఆన్‌లైన్ ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయొద్దని ఆదేశించింది. వ్యూహం సినిమాపై టీడీపీ నేతలు హైదరాబాద్ సిటీసివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ చిత్రానికి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ సినిమా వల్ల చంద్రబాబు ప్రాథమిక హక్కులకు భంగం కలగడంతో పాటు పార్టీ గౌరవం దెబ్బతింటోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి ఆర్జీవీ 'వ్యూహం' పై సెన్సార్ కమిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బెంగళూరులోని రివైజ్ కమిటీకి సిఫార్సు చేసింది. బెంగళూరులో వ్యూహాం మూవీకి క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఆర్జీవీ ఆఫీస్ ఎదుట ఆందోళన జరిగిన సంగతి తెలిసిందే.