Begin typing your search above and press return to search.

మణిపుర్ ఘటన పై సుప్రీం నిప్పులు.. ట్విటర్కు కేంద్రం వార్నింగ్

మేం చర్యలు తీసుకుంటాం మణిపుర్‌ ఘటనపై సుప్రీం గట్టిగా స్పందించింది

By:  Tupaki Desk   |   20 July 2023 8:42 AM GMT
మణిపుర్ ఘటన పై సుప్రీం నిప్పులు.. ట్విటర్కు కేంద్రం వార్నింగ్
X

జాతుల ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్ ఇప్పుడప్పుడే చల్లారేలా లేదు.. మూడు నెలల కిందట మొదలైన వివాదం నేటికీ కొనసాగుతోంది. జూన్ నెలలో ఏకంగా ఒక్క రోజే 40 మంది పైగా మిలిటెంట్లను హతమార్చడం సంచలనం రేపింది. ఇప్పటికీ ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించలేదు. దీనిపై కోర్టులోనూ కేసులు నడుస్తుండడం గమనార్హం.

అయితే, ఈలోగానే మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోలు బయటకు రావడం సంచలనం రేపుతోంది. రాజకీయ పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపట్టుకు కూర్చున్నాయి. దేశవ్యాప్తంగా ఓవైపు ఆగ్రహం పెల్లుబుకుతుండగా.. సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈలోగా సుప్రీం కోర్టులో గురువారం ఈ ఘటన విచారణకు వచ్చింది. ఘటనను సర్వోన్నత న్యాయస్థానం సుమోటోగా స్వీకరించింది.

దీనిపై సుప్రీం తీవ్రంగా స్పందించింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

లేదంటే.. మేం చర్యలు తీసుకుంటాం మణిపుర్‌ ఘటనపై సుప్రీం గట్టిగా స్పందించింది. ఇదంతా తనను ఆందోళనకు గురిచేసిందని.. ఇలాంటి దాడులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కేంద్రం తగిన రీతిలో స్పందించకుంటే తామే చర్యలు చేపడతామని హెచ్చరించారు.

మరోవైపు దారుణ ఘటనకు పాల్పడిన నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సామాజిక మాధ్యమాల్లో బహిర్గతమైన ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయ్యారని పేర్కొంది.

ట్విటర్ కు గట్టి హెచ్చరిక.. చర్యలు తప్పవా?

మహిళలపై దారుణకాండకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంపై కేంద్ర ప్రభుత్వం మండిపడింది.

శాంతిభద్రతలు, ఇతర కారణాల దృష్ట్యా ఈ వీడియోలను తక్షణమే తొలగించాలని ట్విటర్‌, ఇతర సామాజిక మాధ్యమ సంస్థలను ఆదేశించింది. మణిపుర్ దారుణంపై దర్యాప్తు జరుగుతోందని.. భారత చట్టాలకు అనుగుణంగా వ్యవహరించాలని సోషల్ మీడియా సంస్థలకు సూచించింది. అయితే, మిగతా సోషల్ మీడియా కంటే అత్యుత్సాహ చూపిన ట్విటర్ పై కేంద్రం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు ఆ సంస్థ మీద చర్యలు కూడా తీసుకోనున్నట్లు సమాచారం.