Begin typing your search above and press return to search.

జగన్ బెయిల్ రద్దుపై సుప్రీం విచారణ వాయిదా

వైసీపీ అధినేత జగన్ పై నమోదైన కేసుల విచారణలో ఎడతెగని జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సుప్రీంకోర్టులో కేసు వేశారు.

By:  Tupaki Desk   |   20 Jan 2025 11:18 AM GMT
జగన్ బెయిల్ రద్దుపై సుప్రీం విచారణ వాయిదా
X

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ బెయిల్ రద్దు చేయాలని, ఆయనపై నమోదైన కేసుల విచారణను వేగవంతం చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. అయితే సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది అందుబాటులో లేకపోవడంతో తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేశారు.

వైసీపీ అధినేత జగన్ పై నమోదైన కేసుల విచారణలో ఎడతెగని జాప్యం జరుగుతోందని ఆరోపిస్తూ డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం గతంలో విచారణ చేపట్టింది. అయితే అనూహ్యంగా ఈ కేసును సుప్రీం రిజస్ట్రీ వేరే ధర్మాసనానికి బదిలీ చేసింది. జస్టిస్ వీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్రశర్మ ధర్మాసనానికి బదిలీ చేసింది. గత పన్నెండు సంవత్సరాలుగా ట్రయల్ కోర్టులో ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదంటూ జస్టిస్ నాగరత్న ధర్మాసనం ముందు రఘురామ తరఫు న్యాయవాది శ్రీనివాసన్ వాదించారు. గత పదేళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోస్ చేయలేదని, ఈ వ్యవహారంలో దర్యాప్తు సంస్థ, నిందితుడితో కుమక్కైందని పిటిషనర్ ఆరోపించారు.

మరోపక్క డిశ్చార్జ్ పిటిషన్ పై వాదనలు విని వాటిపై ఎలాంటి నిర్ణయం వెలువరించకుండానే ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారని, ప్రతిసారి ఇలా జరుగుతున్నందున ఇందులో కుట్రకోణం దాగి ఉందన్న అనుమానం కలుగుతోందని రఘురామ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆ ఉద్దేశంతో కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతున్నట్లు పిటిషనర్ కోరారు. అయితే బదిలీ సాధ్యం కాదని గత విచారణలో సుప్రీంకోర్టు తేల్చిచెప్పినందున కేసు విచారణను పూర్తి చేయాలని కోరుకుంటున్నట్లు న్యాయవాది శ్రీనివాసన్ తెలిపారు. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయాన్ని కూడా సీబీఐ తరపున న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని, ఇంకా కేసు అక్కడ పెండింగ్లో ఉందని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ చెప్పారు.

గత పదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నారని.. సుప్రీం కోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినప్పటికీ ట్రయల్‌లో జాప్యం జరుగుతోందని సీబీఐ న్యాయవాది కోర్టుకు నివేదించారు. రఘురామ పిటిషన్ పై వాదనలు వినిపించేందుకు తమకు కొంత సమయం కావాలని కోరారు. సీబీఐ తరపు సీనియర్ న్యాయవాది మరో కేసులో వాదనలు వినిపిస్తున్నందున ఈ కేసును వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు. దీంతో విచారణను వచ్చే సోమవారం వరకు వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.