హైదరాబాద్ లో సుప్రీం కోర్టు బెంచ్ డిమాండ్
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, అలాగే కర్ణాటక బార్ కౌన్సిల్‌లు దక్షిణాదిలో సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉన్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 10 Oct 2024 11:30 PM GMTతెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, అలాగే కర్ణాటక బార్ కౌన్సిల్‌లు దక్షిణాదిలో సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా ఏళ్లుగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై 2021లో పార్లమెంటులో ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా ప్రవేశపెట్టారు. సుప్రీం కోర్టును వికేంద్రీకరించి ఢిల్లీ , ముంబై , చెన్నై మరియు కోల్‌కతాలో ఉత్తర , పశ్చిమ , దక్షిణ, తూర్పు జోన్‌లకు నాలుగు ప్రాంతీయ బెంచ్‌లను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది.
పార్లమెంటులోని వివిధ స్టాండింగ్ కమిటీలు, 2009లో, 18వ లా కమిషన్ కూడా భారత సుప్రీంకోర్టు ప్రాంతీయ బెంచ్‌ల ఏర్పాటుకు సిఫారసు చేసింది. కానీ, ఆ దిశగా అడుగులు మాత్రం పడడం లేదు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు సౌత్ ఇండియా రీజినల్ బెంచ్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని దక్షిణ భారత అడ్వకేట్ జేఏసీ అధ్యక్షుడు సుధా నాగేందర్ కోరారు.
ఇదే డిమాండ్‌తో దక్షిణ భారత అడ్వకేట్ జేఏసీ ఆధ్వర్యంలో చాలాకాలంగా పోరాడుతున్నామని అన్నారు. కానీ, తమ డిమాండ్ ను మాత్రం పాలకులు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అందుకే, సుప్రీంకోర్టు రీజినల్ బెంచ్ సాధన సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ 10వ తేదీన మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నల్లకుంటలోని దక్షిణ భారత అడ్వకేట్ జేఎసీ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందని ప్రకటించారు. ఈ సమావేశానికి సుప్రీంకోర్టు న్యాయ వాదులు, మేధావులు, పలువురు ప్రముఖులు హాజరవుతారని చెప్పారు.
వాస్తవానికి సుప్రీంకోర్టులో ప్రస్తుతం న్యాయమూర్తుల కోసం 34 సీట్లు ఉన్నాయి. కానీ, దేశ జనాభాతో పోలిస్తే ఆ సంఖ్య చాలా తక్కువ. దీంతో, ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. దీంతో, దక్షిణాదిలో ప్రాంతీయ బెంచ్‌ల ఏర్పాటు న్యాయమూర్తుల సీట్లు పెరుగుతాయన్న వాదన ఉంది. అయితే, సుప్రీంకోర్టు రీజనల్ బెంచ్‌లకు వ్యతిరేకంగా కొందరు వాదనలు వినిపిస్తున్నారు. ప్రాంతీయ బెంచ్ ల వల్ల సుప్రీంకోర్టు నిర్ణయాల కట్టుబాటు శక్తి తగ్గతుందని, వాటి ఏర్పాటుకు భారీ మౌలిక సదుపాయాలు కావాలని, ఖర్చు అవుతందని అంటున్నారు.