తాగునీరే లేదు.. సైకిల్ ట్రాకులు కావాలా? సుప్రీం సీరియస్
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఒక పిటిషన్ విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం.. సదరు పిటిషన్ ను కొట్టేసింది.
By: Tupaki Desk | 11 Feb 2025 5:06 AM GMTదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. ఒక పిటిషన్ విచారణ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం.. సదరు పిటిషన్ ను కొట్టేసింది. దేశ వ్యాప్తంగా ప్రత్యేకంగా సైకిల్ ట్రాకులు ఏర్పాటు చేయాలంటూ ఒక పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు చేపట్టింది సుప్రీంకోర్టు ధర్మాసనం. జస్టిస్ ఉజ్జల్ భూయాన్.. జస్టిస్ అభయ్ ఎస్.ఓకాల ధర్మాసనం విచారణ జరిపింది.
ప్రజలందరికి ఉండేందుకు ఇల్లు.. తాగేందుకు మంచినీటి వసతి కల్పించేందుకు సరిపడా నిధుల్లేక రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయని పేర్కొంది. అవేమీ పట్టించుకోకుండా కొందరు సైకిల్ ట్రాకులు అంటూ పగటి కలలు కంటున్నారని మండిపడింది. ‘మురికివాడలకు వెళ్లండి. అక్కడి ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉంటున్నారో చూడండి. వారికి సరైన ఇంటి వసతి కల్పించేందుకు రాష్ట్రాల వద్ద నిధుల్లేవు. ప్రజలకు కనీస వసతులు కల్పించాలి’’ అన్న వ్యాఖ్యలు చేసింది.
మనవి తప్పుడు ప్రాధాన్యతలు.. మన ప్రాధాన్యతలను సరి చేసుుకోవాల్సిన అవసరం ఉందన్న సుప్రీం దర్మాసనం.. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అమలు విషయం మనం ఆలోచించాలి. ప్రజలకు తాగేందుకు మంచినీరు లేదు. ప్రభుత్వ పాఠశాలలు మూతబడుతున్నాయి. మీరేమో సైకిల్ ట్రాక్ లు కావాలంటున్నారు’’ అంటూ పిటిషన్ దాఖలు చేసిన సైక్లింగ్ ప్రోత్సాహకుడు దేవీందర్ సింగ్ నేగి పై మండిపడుతూ.. పిటిషన్ ను కొట్టేసింది. సుప్రీం ఆగ్రహంలో ధర్మాగ్రహం కనిపిస్తుందని చెప్పాలి.