Begin typing your search above and press return to search.

పవన్ మద్దతిచ్చిన ఇప్పటం ఇక్కట్ల 'లెక్క' మారింది!

ఆ సమయంలో ఆ గ్రామ ప్రజలకు నేనున్నా అంటూ పవన్ రంగప్రవేశం చేశారు.

By:  Tupaki Desk   |   20 Dec 2024 7:30 PM GMT
పవన్  మద్దతిచ్చిన ఇప్పటం ఇక్కట్ల లెక్క మారింది!
X

గత ప్రభుత్వం హయాంలోని హాట్ హాట్ టాపిక్స్ లో ఇప్పటం గ్రామం వ్యవహారం ఒకటనే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన రోడ్ల విస్తరణ ఎంతో వివాదాస్పదమైంది. ఆ సమయంలో ఆ గ్రామ ప్రజలకు నేనున్నా అంటూ పవన్ రంగప్రవేశం చేశారు.

అప్పట్లో పవన్ కల్యాణ్ ఇప్పటం పర్యటన మీడియాలో ఫుల్ హల్ చల్ చేసింది. దానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికీ నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. తమ పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి స్థలం ఇచ్చినందుకే ఈ గ్రామంపై వైసీపీ సర్కార్ కక్ష కట్టింది అనే కామెంట్లు బలంగా చేశారు. దీనిపై వైసీపీ సర్కార్ నాడు వివరణ ఇచ్చింది.

ఇందులో భాగంగా... గ్రామస్థులందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాతే రోడ్ల విస్తరణ చేపట్టామని నాడు వైసీపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయినప్పటికీ తగ్గేదేలే అని అంటూ పవన్ కల్యాణ్ సందడి చేశారని అంటారు. ఈ సమయంలో ఇప్పటం గ్రామ ప్రజలకు పవన్ కల్యాణ్ లక్ష రూపాయల హామీ కూడా ఇచ్చారు!

ఇందులో భాగంగా... ప్రభుత్వ చర్యల వల్ల నష్టపోయిన ప్రతీ కుటుంబానికీ రూ. లక్ష ఇస్తానని పవన్ ప్రకటించారు! ఈ నేపథ్యంలోనే... తమకు నోటీసులు ఇవ్వకుండానే రోడ్ల విస్తరణ పేరున ప్రహారీలు కూలగొట్టారని ఆరోపిస్తూ 14 మంది ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే... ఈ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వం మాత్రం నోటీసులు ఇచ్చామని చెప్పింది.

వాళ్లందరికీ నోటీసులు ఇచ్చిన తర్వాతే రోడ్ల విస్తరణకు సంబంధించిన పనులు ప్రారంభించినట్లు నాటి ప్రభుత్వంలో అధికారులు కోర్టుకు తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు సమర్పించారు. దీంతో... ఆ 14 మందికీ ఒక్కొక్కరికీ రూ. లక్ష చొప్పున జరిమానా విధించింది ఏపీ హైకోర్టు. దీంతో... ఈ విషయం సంచలనంగా మారింది.

అయితే... ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆ 14 మంది ఇప్పటం గ్రామస్తులూ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిగింది. ఈ సమయంలో... స్పందించిన సర్వోన్నత న్యాయస్థానం.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. అయితే జరిమానా తగ్గించాలనే విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది!

అవును... హైకోర్టు లక్ష రూపాయల జరిమానా విధించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఇప్పటం ప్రజలకు జరిమానా తప్పలేదు. కాకపోతే కట్టాల్సిన లెక్క మాత్రం కాస్త తగ్గింది. ఇందులో భాగంగా.. లక్ష రూపాయల స్థానంలో తలో పాతిక వేలూ జరిమానా కట్టాలని తీర్పు ఇచ్చింది. దీంతో... ఇప్పటం గ్రామంలో పవన్ హల్ చల్ మరోసారి తెరపైకి వచ్చిందని అంటున్నారు.