Begin typing your search above and press return to search.

రాజ్యాంగ పీఠిక మార్పు కేసులో సుప్రీం తీర్పు ఇదే!

కీలక అంశానికి సంబంధించిన కేసు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వెల్లడించింది.

By:  Tupaki Desk   |   26 Nov 2024 4:59 AM GMT
రాజ్యాంగ పీఠిక మార్పు కేసులో సుప్రీం తీర్పు ఇదే!
X

కీలక అంశానికి సంబంధించిన కేసు విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వెల్లడించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేయటంతో పాటు.. పిటిషనర్ల డిమాండ్లను తోసిపుచ్చటంతో పాటు.. వారి వాదనల్లో పస లేదని తేల్చేసింది. ఈ సందర్భంగా పలు అంశాల్ని ప్రస్తావించింది. రాజ్యాంగ పీఠికను ఇందిరాగాంధీ హయాంలో మార్చిన అంశం.. ఆ సందర్భంగా పీఠికకు జత చేసిన పదాలను వేరుగా ఉంచాలన్న పిటిషనర్ల డిమాండ్ పై తాజాగా సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చేసింది.

1976లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాజ్యాంగ పీఠికలో మార్పులు చేస్తూ 42వ రాజ్యాంగ సవరణపై అభ్యంతరం వ్యక్తం చేయటంతో పాటు.. దానిని మార్చాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పును ఇవ్వటంతో పాటు.. పిటిషనర్ల వాదనపై క్లారిటీ ఇచ్చేయటం గమనార్హం.

పీఠికలో సామ్యవాద (సోషలిస్టు).. లౌకిక (సెక్యులర్).. సమగ్రత (ఇంటెగ్రిటీ) అనే పదాల్ని చేరుస్తూ చేపట్టిన సవరణను పీఠికలో చేర్చకుండా.. విడిగా ఒక పేరాలో నమోదు చేయాలన్నది పిటిషనర్ల వాదన. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ సంజయ్ కుమార్ ల ధర్మాసనం నవంబరు 22తో వాదనలు ముగించింది. సోమవారం తీర్పును వెలువరించింది.

రిట్ పిటిషన్లపై తదుపరి విచారణ కానీ.. తీర్పు కానీ అవసరం లేదన్న సుప్రీంకోర్టు.. ‘‘రాజ్యాంగంలోని పీఠికను కూడా సవరించే అధికారం పార్లమెంట్ కు ఉంది. సవరణకు ఇప్పటికే చాలా కాలం గడిచింది. అందుకే ఆ ప్రక్రియ రద్దు సాధ్యం కాదు. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని మార్పులకు ఆమోదించిన తేదీ ప్రభుత్వ అధికారాన్ని తగ్గించదు. ఆ అధికారాలను సవాలు చేయలేం. పీఠికకు సైతం మార్పులు చేపట్టే అధికారం పార్లమెంట్ కు ఉంది. ఈ అంశంపై ఇప్పటికే పలు న్యాయపరమైన సమీక్షలు జరిగాయి. అత్యవసర సమయంలో పార్లమెంట్ తీసుకున్న నిర్ణయాలను రద్దు చేయాలని చెప్పలేం. ఎన్నో ఏళ్లు గడిచిన తర్వాత పీఠికలో చేసిన మార్పులపై ఇప్పుడెందుకు అభ్యంతరం చెబుతున్నారు?’’ అంటూ పిటిషనర్లను సుప్రీం ప్రశ్నించింది.

ఈ సందర్భంగా పిటిషనర్లు అశ్వినీ ఉపాధ్యాయ్.. మరో పిటిషనర్ సుబ్రమణ్యస్వామిలు ఇద్దరు పీఠికలో చేర్చిన పదాలపై తమ సమ్మతి వ్యక్తం చేస్తూనే.. తమ వాదనల్ని వినిపించారు. సామ్యవాదం.. లౌకికవాదం అనే పదాల చేరిక తనకు సమ్మతమేనని..కాకుంటే రాజ్యంగ పీఠికలో చేర్చటం మీదే తనకు అభ్యంతరమని అశ్వినీ ఉపాధ్యాయ పేర్కొన్నారు. మరో పిటిషనర్ సుబ్రమణ్య స్వామి వాదనలు వినిపిస్తూ.. 1949లో ఆమోదించిన రాజ్యాంగ పీఠికను యథాతథంగా ఉంచుతూ.. 1976లో చేపట్టిన మార్పులను వేరుగా ప్రత్యేక పేరాలో ఉంచాలన్నదే తన ఉద్దేశంగా పేర్కొన్నారు. అయితే.. ఈ వాదనల్ని సుప్రీం తోసిపుచ్చింది.

ఈ అంశంపై తొలిసారి 2020లో బలరాం సింగ్ అనే వ్యక్తి విష్ణు శంకర్ జైన్ అనే లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేవారు. సామ్యవాదం అనే పదాన్ని మన దేశానికి వర్తింపజేసుకుంటే సంక్షేమ రాజ్యమనే అర్థం వస్తుందన్న వ్యాఖ్య చేసింది. మొత్తంగా పిటిషనర్లు కోరుకున్నట్లుగా ఇందిరా గాంధీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ పీఠికలో చేర్చిన మూడు పదాల్ని మార్చటం సాధ్యం కాదని.. ఒకవేళ వాటిని మార్చాలనుకుంటే ఆ అవకాశం పార్లమెంటుకు ఉందన్న విషయాన్ని సుప్రీం తన తాజా తీర్పుతో స్పష్టం చేసినట్లుగా చెప్పాలి.