Begin typing your search above and press return to search.

విడాకులు తీసుకోకుండా విడిగా ఉన్నా భరణం తీసుకోవచ్చన్న సుప్రీం!

భర్తతో కలిసి ఉండలేకపోవటానికి తగిన కారణం ఉండాలని.. అప్పుడు మాత్రమే విడాకులు తీసుకోకున్నా.. భరణం తీసుకునే అర్హత ఉంటుందని సుప్రీం పేర్కొనటం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   14 Jan 2025 5:05 AM GMT
విడాకులు తీసుకోకుండా విడిగా ఉన్నా భరణం తీసుకోవచ్చన్న సుప్రీం!
X

ఆసక్తికర ఆదేశాల్నిజారీ చేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం. భర్త నుంచి విడాకులు తీసుకోకుండా విడిగా ఉంటున్న మహిళ.. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాల్సిందిగా కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనికి సంబంధించిన కేసులో భర్త భరణం ఇవ్వాలని పేర్కొంది. అయితే.. దీనికో అంశం తప్పనిసరి అన్న విషయాన్ని నొక్కి చెబుతూ.. తన ఆదేశాల వేళ స్పష్టం చేసింది అత్యున్నత న్యాయస్థానం. భర్తతో కలిసి ఉండలేకపోవటానికి తగిన కారణం ఉండాలని.. అప్పుడు మాత్రమే విడాకులు తీసుకోకున్నా.. భరణం తీసుకునే అర్హత ఉంటుందని సుప్రీం పేర్కొనటం ఆసక్తికరంగా మారింది.

జార్ఖండ్ కు చెందిన యువతి.. యువకుడు 2014 మే ఒకటో తేదీన పెళ్లి చేసుకున్నారు. అయితే.. వారిద్దరి ఆ తర్వాతి సంవత్సరం ఆగస్టులో విడిపోయారు. అయితే.. వారిద్దరూ అధికారికంగా ఎలాంటి విడాకులు తీసుకోలేదు. చివరకు ఈ వ్యవహారం ఫ్యామిలీ కోర్టుకు చేరింది. దీనికి కారణం.. తనకు భర్త నుంచి భరణం ఇప్పించాలని భార్య కోరటం.. అందుకు భర్త నో చెప్పటంతో ఈ ఇష్యూ బయటకు వచ్చింది.

వారిద్దరూ కలిసి ఉండొచ్చని.. వివాహ సంబంధం ఎప్పటిలానే కొనసాగించొచ్చని చెబుతూ ఫ్యామిలీ కోర్టు 2022 మార్చి 23న డిక్రీ జారీ చేసింది. అందుకు భార్య కట్టుబడి ఉండలేదు. భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఆమెకు నెలకు రూ.10వేలు చొప్పున భరణం ఇవ్వాలని పేర్కొంటూ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల్ని సవాలు చేసిన భర్త.. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు.

భార్య తన వద్దకు తిరిగి రానప్పుడు.. తానెందుకు భరణం చెల్లించాలన్న ప్రశ్నను సంధించారు. అతడి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని తేల్చి చెబుతూ.. తీర్పును ఇచ్చింది. అయితే.. ఈ తీర్పును భార్య సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ కన్నా.. మరో న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమారర్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. భర్తతో కలిసి ఉండకపోయినా.. భార్య భరణం పొందొచ్చని పేర్కొంది. సీఆర్ పీసీ సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం పొందటం భార్య హక్కుగా పేర్కొంటూ ఆదేశాలు జారీ చేసింది.