వైవాహిక అత్యాచారం.. క్రిమినల్ నేరం కాదన్న కేంద్రం
అయితే.. భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో చేసే బలవంతపు శృంగారం ఏ స్థాయి నేరం అవుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
By: Tupaki Desk | 4 Oct 2024 4:53 AM GMTభార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో శారీరక సంబంధం పెట్టుకోవటమా? పాతికేళ్ల క్రితం అంతకు ముందు కానీ ఇలాంటి అంశంపై మాట్లాడటమే ఒక వింతగా.. విచిత్రంగా చూసే వారు. భార్య అంటే భర్త సొంతం కదా? అన్నది నాటి వాదన. అయితే.. భార్య భర్తలు అయినంత మాత్రాన.. భార్యకు ఇష్టం లేకుండా భర్త ఆమెతో శృంగారంచేయటం.. అది కూడా ఆమె అనుమతి లేకుండా బలవంతంగా చేయటం తప్పే అవుతుందన్న వాదనకు ఇప్పుడు కోర్టులు కూడా అవునంటున్నాయి. అయితే.. భార్య అనుమతి లేకుండా భర్త ఆమెతో చేసే బలవంతపు శృంగారం ఏ స్థాయి నేరం అవుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ఈ తప్పును క్రిమినల్ నేరంగా పరిగణించే విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. అంతేకాదు.. దీన్ని రేప్ గా గుర్తించి అందుకు అనుగుణంగా శిక్ష వేస్తే అది అత్యంత తీవ్రమైన చర్య అవుతుందని పేర్కొంది. అయితే.. ఈ తీరును వైవాహిక అత్యాచారంగా భావించొచ్చు కానీ.. క్రిమినల్ నేరంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేసింది.
భార్య ఒప్పుకోని శారీరక సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంలో తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపింది. వైవాహిక అత్యాచారం సామాజిక సమస్యగా పేర్కొన్న కేంద్రం.. దాన్ని చట్టపరమైన అంశంగా కాదంది. ఒకవేళ దీన్ని క్రిమినల్ నేరంగా పరిగణిస్తే సమాజంపై ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించింది. ఇలాంటి సమస్య తలెత్తితే.. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం శిక్షించే అవకాశం ఉందంది.
వివాహ వ్యవస్థలో శారీరక సంబంధం అన్నది ఒక అంశమని.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తించే అంశం కోర్టుల పరిధిలోకి రాదని పేర్కొంది. రాష్ట్రాలు.. భాగస్వాములు.. అన్ని వర్గాలతో తగిన చర్చలు లేకుండా ఈ విషయంలో నిర్ణయాన్ని తీసుకోలేమని స్పష్టం చేసింది. పెళ్లి కాకముందు మహిళ సమ్మతి లేకుండా శృంగారం తీవ్రమైన నేరమని.. అదే సమయంలో వివాహ వ్యవస్థలో పరిస్థితి వేరుగా ఉంటుందని తెలిపింది. భార్య అనుమతి లేని భర్త శారీరక సంబంధం తీవ్రమైన నేరం కాదని తెలిపింది.
అలా అని పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్య అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్న భావన కూడా సరికాదని స్పష్టం చేసింది. అలాంటి హక్కు భర్తకు ఉండదన్న కేంద్రం.. ఒకవేళ అలాంటి చర్యకు పాల్పడితే చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించింది. భర్త ద్వారా కలిగిన అవాంచిత గర్భాన్ని తొలగించే విషయమై 2022లో సుప్రీంకోర్టు తీరపు చెబుతూ.. తొలిసారి వైవాహిక అత్యాచారం అన్న భావనను ప్రస్తావించింది. దీన్ని నేరంగా గుర్తిస్తూ అబార్షన్ కు ఓకే చెప్పింది. అయితే.. దీన్ని రేప్ లా తీవ్రమైన నేరంగా పరిగణించాలంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ సందర్భంగా కేంద్రం తన అభిప్రాయాన్ని తాజాగా వెల్లడించింది.