చిన్నపిల్లల సాక్ష్యం చెల్లుతుంది: సుప్రీంకోర్టు సంచలన తీర్పు
దేశంలో ఇప్పటి వరకు క్రిమినల్ నేరాలు.. ఇతరత్రా కేసుల్లో చిన్న పిల్లల సాక్ష్యాలను అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల సాక్ష్యాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవడం లేదు
By: Tupaki Desk | 26 Feb 2025 1:26 PM GMTదేశంలో ఇప్పటి వరకు క్రిమినల్ నేరాలు.. ఇతరత్రా కేసుల్లో చిన్న పిల్లల సాక్ష్యాలను అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల సాక్ష్యాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవడం లేదు. దీనికి కారణం.. చిన్నారులు అన్న ఒకే ఒక్క కారణం. పైగా.. వారుఎవరో చెప్పిన మాటలను అత్యంత నమ్మకంగా విశ్వసిస్తారనే భావన ఉండడం తో చిన్న పిల్లల సాక్ష్యాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవు. కొన్ని దశాబ్దాలుగా ఇదే కొనసాగుతోంది. అయితే.. తాజాగా ఓ కేసులో సుప్రీంకోర్టు దీనిపై వివరణ ఇచ్చింది.
చిన్న పిల్లల సాక్ష్యం చెల్లుతుందని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఓ చిన్నారి సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఆ చిన్నారి తండ్రికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు చెప్పింది. మద్యానికి బానిసైన ఓ వ్యక్తి.. తన భార్యను రోజూ చిత్రహింసలకు గురి చేసేవాడు. ఆమె కూలి పనిచేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నా.. నిత్యం డబ్బులు ఇవ్వమని ఆమెను వేధించేవాడు. ఈ క్రమంలో ఓ రోజు భార్యా భర్తల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తి.. ఇంట్లోని రోకలి బండతో భార్యను తీవ్రంగా కొట్టడంతో ఆమె మృతి చెందింది.
ఇది జరిగి.. రెండేళ్లయినా.. సరైన సాక్ష్యం లేదని పోలీసులు.. కోర్టుకు తేల్చి చెప్పారు. దీంతో దిగువ కోర్టు నిందితుడిని వదిలివేసింది. అయితే.. భార్య తాలూకు కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. వీరి ఏడేళ్ల కుమార్తె ఇచ్చిన వాంగ్మూలాన్ని సుప్రీంకోర్టు రికార్డు చేసింది. తన తల్లిని తనతండ్రి రోకలి బండతో కొట్టడంతోనే ఆమె చనిపోయిందని పిల్ల సాక్ష్యం చెప్పింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు సదరు భక్తుకు కఠిన జీవిత ఖైదు విధిస్తూ.. తీర్పు చెప్పింది.
ఈ సందర్భంగా చిన్నారుల సాక్ష్యాన్ని కీలక కేసుల్లో పరిగణనలోకి తీసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే.. వారు చెబుతున్న సాక్ష్యం కీలకమైనప్పుడు మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, వేరే వ్యక్తులు వారిని ప్రభావితం చేశారో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయాలనిదిగువ కోర్టులకు సూచించింది. ఎలాంటి ప్రభావం చూపలేదని నిర్ధారించుకున్న తర్వాత చిన్నారుల సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం తప్పుకాదని తేల్చి చెప్పింది.