Begin typing your search above and press return to search.

వైద్యురాలి హత్యాచార ఘటన.. సీబీఐ పరిస్థితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!

కోల్ కతా లో వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందనేది తెలిసిన విషయమే.

By:  Tupaki Desk   |   17 Sep 2024 8:25 AM GMT
వైద్యురాలి హత్యాచార ఘటన.. సీబీఐ పరిస్థితిపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!
X

కోల్ కతా లో వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందనేది తెలిసిన విషయమే. అయితే ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా ఓ కొలిక్కి రాలేని పరిస్థితి! ఈ సమయంలో తాజాగా సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థ సీబీఐ పరిస్థితిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

అవును... దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్ కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీబీఐపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... సీబీఐ నిద్ర పోవట్లేదని.. నిజాన్ని వెలికితీసేందుకు వారికి కొంత సమయం ఇవ్వాలని వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో.. సొలిసిటర్ జనరల్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది.

ఇందులో భాగంగా... బాధితురాలి ఫోటోను, పేరును వికీపీడియా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని తుషార్ మొహతాను న్యాయస్థానం ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత సీబీఐకి కేసు అప్పగించడం వల్ల పలు సవాళ్లు ఎదురవుతున్నాయని.. కేసులో పరిమితమైన పురోగతే కనిపిస్తుందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.

మరోపక్క సుప్రీంకోర్టు గత ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించిన స్టేటస్ రిపోర్ట్ ను సీబీఐ తాజాగా సమర్పించింది. ఈ సమయంలో ఆ రిపోర్ట్ లో పేర్కొన్న విషయాలు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటివరకూ ఐడెంటిఫై చేసిన వివరాలను బయటపెట్టడం వల్ల దర్యాప్తు పై ప్రభావం పడొచ్చని పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటల్ లో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు సంబంధించిన విషయాలపై సీబీఐ అనేక లీడ్స్ ను అనుసరిస్తోందని.. సున్నితమైన ఈ కేసులో ఛార్జిషీట్ దాఖలు చేసే విషయంలో తొందరపడకూడదని.. అందుకే దర్యాప్తు సంస్థకు సమయం ఇద్దామని పేర్కొంది.

ఈ సందర్భంగా స్పందించిన భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్తీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా.. సీబీఐ స్టేటస్ రిపోర్ట్ ను పరిశీలించారు. ఈ సమయంలో.. ప్రిన్సిపాల్ తో పాటు ఎస్.హెచ్.ఓ. ని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి.. వేచి చూద్దామని చీఫ్ జస్టిస్ అన్నారు!