Begin typing your search above and press return to search.

తిరుమల లడ్డూ.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

By:  Tupaki Desk   |   30 Sep 2024 11:18 AM GMT
తిరుమల లడ్డూ.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
X

తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా అని ప్రశ్నించింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని వ్యాఖ్యానించింది. ఈ అంశంపై పలువురు దాఖలు చేసిన పిటిషన్‌ లపైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు.. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

ల్యాబ్‌ వద్ద ఆధారాలు ఉన్నాయా? నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపామని టీటీడీ ఈవో చెప్పారు కదా? ఇదంతా పబ్లిక్‌ డొమైన్‌ లో ఉంది కదా? అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేవుని రాజకీయాల్లోకి లాగొద్దని వ్యాఖ్యానించింది. సీఎం రాజ్యాంగ పదవిలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి కదా.. జూలైలో రిపోర్టు వస్తే సెప్టెంబర్‌ లో ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. సిట్‌ ఎందుకు వేశారు? ఇది దర్యాప్తునకు సరిపోతుందా? అని ప్రశ్నించింది.

కల్తీ నెయ్యిని లడ్డూలో వాడారో లేదో పూర్తిగా తెలియకుండా ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారని సుప్రీంకోర్ట్‌ నిలదీసింది. ఈ అంశంపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) నియమించిన అనంతరం కల్తీ నెయ్యిపై మీడియా ముందు ప్రకటన చేయడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా నియమించిన సిట్‌ సరిగ్గా విచారణ జరపగలదా? అన్న సందేహాలు ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది

కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశంపై మీ వ్యాఖ్యలతో వారిని గాయపరిచారు అంటూ సీఎం చంద్రబాబు పై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. నెయ్యి రిజెక్ట్‌ చేశాక వాడే పరిస్థితి ఉండదు కదా అని ధర్మాసనం ప్రశ్నించింది.

నెయ్యి కల్తీ జరిగినట్టు సాక్ష్యం ఉందా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్‌ ఎందుకు తీసుకోలేదని నిలదీసింది. సెకండ్‌ ఒపీనియన్‌ ఎందుకు తీసుకోలేదు? అని ప్రశ్నించింది. కల్తీ జరిగినట్లు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా? అని అడిగింది. లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదని కోర్టు ప్రశ్నలు సంధించింది. ఇరు పక్షాల న్యాయవాదుల వాదన విన్న కోర్టు తదుపరి విచారణను అక్టోబర్‌ మూడో తేదీకి వాయిదా వేసింది.