Begin typing your search above and press return to search.

జగన్ అక్రమాస్తుల కేసు... సీబీఐ, ఈడీలకు సుప్రీం కీలక ఆదేశాలు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   2 Dec 2024 6:50 AM GMT
జగన్  అక్రమాస్తుల కేసు... సీబీఐ, ఈడీలకు సుప్రీం కీలక ఆదేశాలు!
X

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసుల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) లను దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.

అవును... ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ఈ కేసుల పూర్తి వివరాలు అందించాలని సీబీఐ, ఈడీలను సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను రెండు వారాల్లోగా అందించాలని.. కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జ్ పిటిషన్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.

ఇదే సమయంలో తెలంగాణ హైకోర్టులో పెండింగ్ లో ఉన్న అప్లికేషన్ల వివరాలు.. సీబీఐ, ఈడీ కేసుల వివరాలు విడివిడిగా చార్ట్ రూపంలో అందించాలని తెలిపింది. ఈ సందర్భంగా అన్ని వివరాలతో అఫిడవిట్లు రెండు వారాల్లో దాఖలు చేయాలని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం ఈ మేరకు విచారణ జరిపింది.

కాగా... జగన్ కు గతంలో అక్రమస్తుల కేసులో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరుగుతున్న విచారణను మరో రాష్ట్రానికి మార్చాలని రఘురామ కృష్ణంరాజు రెండు పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇటీవల సీజేఐ బెంచ్ లోని న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ ‘నాట్ బిఫోర్ మీ’ అన్న సంగతి తెలిసిందే.

దీంతో... సీజేఐ జస్టిస్ సంజీవి ఖన్నా ఈ పిటిషన్ విచారణను మరో బెంచుకు మార్చారు. ఈ నేపథ్యంలో రఘురామ రాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ అభయ్ ఓకా నేతృత్వంలోని మరో బెంచ్ కు గత నెలలో బధిలీ చేశారు. ఈ నేపథ్యంలో నేడు ఈ పిటిషన్లపై స్పందించిన అభయ్ ఓకా... సీబీఐ, ఈడీలకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు!