క్రిమినల్ కేసులున్నా..ప్రజాప్రతినిధులుగా ఎలా?: సుప్రీం సూటి ప్రశ్న
ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో విచారణ వేగవంతం చేయడంపై వాదనల సందర్భంగా సోమవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 10 Feb 2025 10:11 AM GMTప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల్లో విచారణ వేగవంతం చేయడంపై వాదనల సందర్భంగా సోమవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం అమికస్ క్యూరీ విజయ్ హన్సారియా సమర్పించిన నివేదికను పరిశీలించింది. అనంతరం స్పందిస్తూ.. వ్యక్తిపై క్రిమినల్ కేసులుంటే వారు ఉద్యోగంలో చేరేందుకే అనర్హులు అని.. అలాంటిది క్రిమినల్ కేసులున్న ప్రజా ప్రతినిధులు ఎలా అర్హులవుతారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఎన్నికల సంఘానికి సూచన
క్రిమినల్ కేసులున్న వారు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే విషయంలో మరింత పకడ్బందీ చర్యలు తీసుకోవాలని.. దానికి అనుగుణంగా ఉన్నత పరిష్కారం ఆలోచించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం సూచించింది. కాగా, ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసుల విచారణకు గాను.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను మార్చి 4వ తేదీకి వాయిదా వేసింది.
క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన నేతలు తిరిగి ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధం విధించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ్ 2016లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపైనే సుప్రీ ధర్మాసనం విచారణ జరిపింది. కాగా, ధర్మాసనంకు సమర్పించిన నివేదికలో అమికస్ క్యూరీ పలు కీలక విషయాలను ప్రస్తావించారు.
42 మంది లోక్‌సభ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని.. కొన్నిచోట్ల ప్రజాప్రతినిధులపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని నివేదికలో పేర్కొన్నారు. దేశంలో చాలాచోట్ల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులు లేవని ప్రస్తావించారు. నిందితులు ఏళ్లుగా విచారణకు రాకపోవడం, పదేపదే వాయిదాలు కోరుతుండటం జాప్యానికి మరో కారణంగా పొందుపరిచారు.