Begin typing your search above and press return to search.

ఇదెక్కడి న్యాయం..? బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ దాడులు సరికాదని.. వెంటనే వాటిని ఆపాలంటూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   17 Sep 2024 8:30 PM GMT
ఇదెక్కడి న్యాయం..? బుల్డోజర్‌ జస్టిస్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
X

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ దాడులు సరికాదని.. వెంటనే వాటిని ఆపాలంటూ ఇటీవల కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే వ్యాఖ్యలు చేశారు. ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ కూల్చివేతలు చేస్తున్నారని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో నిరసనకు నాయకత్వం వహించిన వ్యక్తి ఇంటిని కూల్చడం ఎంతవరకు సమంజసం అంటూ బీజేపీని నిలదీశారు. అయితే.. తాజాగా ఈ బుల్డోజర్ రాజకీయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది.

పలు నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల ఇళ్లను, దుకాణాలను బుల్డోజర్‌తో కూల్చడాన్ని నిరోధించాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ధర్మాసనం ఈ రోజు విచారించింది. దేశవ్యాప్తంగా కూల్చివేతలపై మార్గదర్శకాలు కూడా అవసరమని పేర్కొంది.

అలాగే.. నేర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనుమానిస్తున్న వారి పట్ల బుల్డోజర్ జస్టిస్ పేరుతో వారి ఇళ్లు, నిర్మాణాలను కూల్చివేయడాన్ని తప్పుపట్టింది. కోర్టు అనుమతి తీసుకున్న తరువాతే అలాంటి కార్యకలాపాలకు పాల్పడాలని సూచించింది. ఈ కూల్చివేతలపై అక్టోబర్ 1వ తేదీ వరకూ స్టే ఇచ్చింది. అప్పటివరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ఆదేశించింది. అదే సందర్భంలో అనధికారిక నిర్మాణాల కూల్చివేతకు ఎలాంటి అనుమతులు అవసరం లేదని కూడా స్పష్టం చేసింది. బహిరంగ వీధులు, ఫుట్‌పాత్‌లు, రైల్వే లైన్లు, బహిరంగ ప్రదేశాల్లో ఇష్టారాజ్యంగా నిర్మించిన వాటికి ఆ ఆర్డర్ వర్తించదని చెప్పింది.

అసెంబ్లీ ఎన్నికలు ఉన్న మహారాష్ట్ర ఝార్ఖండ్, కశ్మీర్, హరియాణా రాష్ట్రాల ఎన్నికల అధికారులకు నోటీసులు ఇస్తామని చెప్పడం కూడా సంచలనంగా మారింది. కాగా.. సుప్రీంకోర్టు తీర్పుపై సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి కూల్చివేతలు చేస్తున్నారనే వాదన పూర్తిగా అవాస్తమని పేర్కొన్నారు. ఈ వాదనలు కోర్టును పూర్తిగా తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు. మరోవైపు.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు మెహతా వ్యాఖ్యలను ఖండించారు. అక్రమ కూల్చివేతలు కొనసాగుతున్నాయని, సమస్య తీవ్రంగానే ఉందని వెల్లడించారు.