సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు చుక్కెదురు.. వరుస ఎదురుదెబ్బలు
అయితే.. ఇదే అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కేటీఆర్‌కు అక్కడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
By: Tupaki Desk | 9 Jan 2025 7:30 AM GMTబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్‌కు వరుసగా షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ కారు రేసు కేసులో క్వాష్ పిటిషన్ కొట్టివేయాలని హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దాంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో నేడు ఏసీబీ ఎదుట హాజరుకావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే.. ఇదే అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లిన కేటీఆర్‌కు అక్కడా ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.
కేటీఆర్‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌ను రేపు విచారణకు స్వీకరించేందుకు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. ఈనెల 15న విచారణకు లిస్ట్ చేయడంతో అదే రోజున సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అప్పటి వరకు కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించిన హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. అలాగే.. మధ్యంతర ఉత్తర్వులను కూడా హైకోర్టు కొట్టేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణకు తీసుకోవాలని కోరగా.. అందుకే సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదంటూ 15వ తేదీన విచారణ జరుపుతామంటూ ఆ రోజు లిస్ట్ చేశారు. కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉండడంతో ఈ రోజు లేదా రేపు విచారించాలని కేటీఆర్ తరఫు న్యాయవాది కోరారు. దానికి సీజేఐ నిరాకరించారు. ఆ రోజే సంజీవ్ కన్నా నేతృత్వంలోనే ధర్మాసనం విచారిస్తుందని స్పష్టం చేశారు.
మరోవైపు.. ఈ కేసు విషయంలో కేటీఆర్ నేడు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. మూడు గంటలుగా ఆయన విచారణ కొనసాగుతోంది. ముగ్గురు ఏసీబీ అధికారులు ఆయనకు ప్రశ్నలు వేస్తున్నారు. దాదాపు 35 ప్రశ్నలతో ఆయన నుంచి సమాధానాలు రాబడుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా కారు రేసులో నిధుల మళ్లింపు అంశంపై కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, దాన కిశోర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను విచారిస్తున్నారని సమాచారం.