Begin typing your search above and press return to search.

ఆ మహిళను ‘ఉంపుడుగత్తె’ అంటారా? బాంబే హైకోర్టుపై సుప్రీం ఫైర్

కేసు విచారణలో భాగంగా ఒక మహిళను ఉద్దేశించి బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.

By:  Tupaki Desk   |   13 Feb 2025 4:26 AM GMT
ఆ మహిళను ‘ఉంపుడుగత్తె’ అంటారా? బాంబే హైకోర్టుపై సుప్రీం ఫైర్
X

కేసు విచారణలో భాగంగా ఒక మహిళను ఉద్దేశించి బాంబే హైకోర్టు చేసిన వ్యాఖ్యలను దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఒక మహిళను ఉద్దేశించి అలా ఎలా వ్యాఖ్యానిస్తారని సీరియస్ అయ్యింది. బాంబే హైకోర్టుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన వైనం చర్చనీయాంశంగా మారింది. ఒక వివాహ సంబంధిత కేసు ఉత్తర్వుల్లో మహిళను ఉద్దేశించి ఉంపుడుగత్తె.. చట్టవిరుద్ధమైన భార్య అంటూ బాంబే హైకోర్టు ఎలా సంబోధిస్తుందని ప్రశ్నించింది. ‘‘ఒక మహిళను ఉద్దేశించి వాడే భాషేనా ఇది?’’ అని ప్రశ్నించింది.

రాజ్యాంగంలోని అధికారణం 21 ప్రకారం.. దేశంలోని ప్రతి వ్యక్తికి గౌరవప్రదమైన జీవనం కొనసాగించే హక్కు ఉందని.. ఒక మహిళను చట్టవిరుద్ధమైన భార్య.. ఉంపుడుగత్తె అని పిలవటం రాజ్యాంగం కల్పించిన ప్రాధమిక హక్కును ఉల్లంఘించటమే అవుతుందని పేర్కొంది. మహిళలపై లాంటి పదాల్ని వినియోగంచటం రాజ్యాంగ మూల సూత్ాలకు.. ఆదర్శాలకు వ్యతిరేకమన్న సుప్రీంకోర్టు.. ‘‘రద్దైన వివాహంలో ఒక పిటిషన్ అయిన మహిళపై ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం ఇచ్చిన తీర్పులో ఇలాంటి అభ్యంతరకర పదజాలం కనిపించటం భాదాకరం’’ అని పేర్కొన్నారు.

సుఖ్ బీర్ సింగ్ వర్సెస్ సుఖ్ బీర్ కౌర్ వివాహం రద్దు తర్వాత జీవితభాగస్వామికి శాశ్వత భరణం.. తాత్కాలిక భ్రతి ఇవ్వొచ్చని పేర్కొన్నారు. అయితే.. ఇది కేసులో వాస్తవాలను అనుసరించి.. పార్టీల ప్రవర్తనను అనుసరించి మారుతుందని పేర్కొన్నారు. హిందూ వివాహ చట్టం 1955 లోని సెక్షన్ 11 ప్రకారం పెళ్లి రద్దుఅయితే.. సెక్షన్ 25 ప్రకారం శాశ్వత భరణం లేదా భ్రతి పొందొచ్చంటూ ధర్మాసనం పేర్కొంది. మహిళను ఉద్దేశించి అవమానకర పదాన్ని వాడిన అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ అభయ్. ఎస్.ఓక్, జస్టిస్ అమానుల్లా, జస్టిస్ జార్జ్ మసీహ్ లు ఉన్నారు.