Begin typing your search above and press return to search.

ఆ డబ్బు విషయంలో భార్యలకున్న పవర్ చెప్పిన సుప్రీం!

న్యాయస్థానం స్త్రీ ధనం భార్యభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఆ ఆస్తి మీద భర్తకు ఎలాంటి హక్కు ఉండదని పేర్కొంది.

By:  Tupaki Desk   |   26 April 2024 5:12 AM GMT
ఆ డబ్బు విషయంలో భార్యలకున్న పవర్ చెప్పిన సుప్రీం!
X

ఆసక్తికర అంశాన్ని విస్పష్టంగా తెలియజేసింది దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. భార్యకు చెందిన డబ్బుల విషయంలో భర్తకు ఎలాంటి హక్కులు ఉండవని స్పష్టం చేసింది. అంతేకాదు.. కష్టంలో ఉన్నప్పుడు భార్య దగ్గరి డబ్బులు తీసుకున్నప్పటికీ.. ఆ తర్వాత వాటిని తిరిగి భార్యకు ఇచ్చేయాల్సిన నైతిక బాధ్యత భర్త మీద ఉంటుందన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఒక కేసులో ఒక మహిళ నష్టపోయిన బంగారానికి బదులుగా ఆమె భర్తను రూ.25 లక్షలు చెల్లించాలంటూ ఆదేశాల్ని జారీ చేసింది.

ఆసక్తికరమైన ఈ కేసు వివరాల్లోకి వెళితే.. పెళ్లి టైంలో తన పుట్టింటి వారు తనకు భారీగా బంగారు ఆభరణాలు ఇచ్చారని.. పెళ్లి తర్వాత తన తండ్రి తన భర్తకు రూ.2 లక్షల చెక్ ఇచ్చారన్న మహిళ.. 'ఫస్ట్ నైట్ రోజునే నా ఆభరణాల్ని నా భర్త తీసుకున్నాడు. జాగ్రత్తగా ఉంచుతానని చెప్పి వాటిని తన తల్లికి అప్పగించాడు.

ఆ తర్వాత వారిద్దరు తమకు అప్పటికే ఉన్న అప్పుల్ని తీర్చేందుకు వాటిని వాడారు. నా తల్లిదండ్రులు ఇచ్చిన బంగారాన్ని దుర్వినియోగం చేశారు. నాకు జరిగిన నష్టాన్ని తీర్చాల్సిందే" అంటూ ఒక మహిళ భర్త మీద పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఆమెకు జరిగిన నష్టాన్ని పూడ్చుకునే హక్కు ఆమెకు ఉందని పేర్కొంటూ 2011లో ఒక కుటుంబ కోర్టు తీర్పును ఇచ్చింది. అప్పీల్ లో భాగంగా ఈ కేసు కేరళ హైకోర్టుకు వచ్చింది. అక్కడ ఈ కేసును కొట్టేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దీంతో సదరు మహిళ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా.. జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన న్యాయస్థానం స్త్రీ ధనం భార్యభర్తల ఉమ్మడి ఆస్తి కాదని స్పష్టం చేసింది. ఆ ఆస్తి మీద భర్తకు ఎలాంటి హక్కు ఉండదని పేర్కొంది. ఆమె బంగారు ఆభరణాల్ని దుర్వినియోగం చేసిన దానికి బదులుగా.. ఆమెకు రూ.25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది.